హైదరాబాద్‌లో ఏటా ఎంతో ఉత్సాహంగా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన.. నుమాయిష్ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల చిరు వ్యాపారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 1938 నుంచి హైదరాబాద్‌లో నుమాయిష్ నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, పారిశ్రామిక వాతావరణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏటా ఈ ప్రదర్శనను నిర్వహిస్తూ వస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు ఏటా లక్షల్లో సందర్శకులు వస్తుంటారు. నుమాయిష్.. అటు వ్యాపారంతో పాటు.. వినోదం, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పంచి వెళుతుంటుంది.
గతేడాది నిర్వహించిన 79వ ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవటం వల్ల.. కొంత మంది వ్యాపారులు నష్టపోయారు. సందర్శకుల్లోనూ భయాందోళనలు రేకెత్తాయి. ఈసారి అవి పునరావృతం కాకుండా.. భద్రతకు పెద్దపీట వేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో సులువుగా బయటపడేలా నిష్క్రమణ గేట్లు పెంచటం, సుశిక్షితులైన 40మంది అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవటం, భూగర్భ విద్యుత్ కేబుల్ సిస్టం ఏర్పాటు ఇలా.. రూ.3కోట్లను భద్రత కోసమే ఖర్చు చేస్తున్నామని.. సందర్శకుల ఇతర సౌకర్యాలు, వసతులు కొసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభాశంకర్ తెలిపారు.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 18 విద్యాసంస్థల ద్వారా 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు వెచ్చిస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 2020 నుమాయిష్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. అన్ని రకాల అనుమతులు, చర్యలు తీసుకొని హ్యాపీ ఎగ్జిబిషన్‌ను అందించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : నుమాయిష్‌కు హైకోర్టు పచ్చజెండా