రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషి 2018 ఫిబ్రవరి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 1960లో జన్మించిన జోషి.. ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు. దాదాపు రెండేళ్లు సీఎస్‌గా ఉన్న ఆయనకు కొనసాగింపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ విషయమై ఆయన కూడా ఆసక్తిగా లేరు. జోషీ స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను సీఎస్‌గా నియమిస్తారు. ప్రస్తుతం ఆ హోదాలో పలువులు అధికారులు ఉన్నారు.
1983 బ్యాచ్‌కు చెందిన బీపీఆచార్య, బినయ్ కుమార్, 1984 బ్యాచ్‌కు చెందిన అజయ్ మిశ్రా ఈ జాబితాలో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన పుష్పా సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, 1986 బ్యాచ్‌కు చెందిన రాజేశ్వర్ తివారీ కూడా సీనియర్ అధికారులే. 1987 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్‌కు చెందిన అదర్ సిన్హా, రాణికుమిదిని, శాలినీమిశ్రా జాబితాలో ఉన్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, సోమేశ్ కుమార్ కూడా ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్నారు. వీరిలో ఎవరినైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది.
వీరిలో బినయ్ కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, రాణికుమిదిని కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన అధికారులు అజయ్ మిశ్రా, చిత్రారామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, అదర్ సిన్హా, సోమేశ్ కుమార్, శాంతికుమారి సీఎస్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉంది.
1984 బ్యాచ్‌కు చెందిన అజయ్ మిశ్రాకు 2020 జులై వరకు పదవీకాలం ఉంది. వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించిన అజయ్ మిశ్రా రేసులో ముందున్నారు. చిత్రారామచంద్రన్‌కు 2021 ఏప్రిల్ వరకు, రాజేశ్వర్ తివారీకి 2020 ఫిబ్రవరి వరకు పదవీకాలం ఉంది. శాలినీమిశ్రా 2022 నవంబర్ వరకు పదవిలో ఉంటారు. 2022 మే వరకు అదర్ సిన్హా, 2023 డిసెంబర్ వరకు సోమేశ్ కుమార్, 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి పదవిలో ఉంటారు. కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నందున రాజేశ్వర్ తివారీకి అవకాశాలు తక్కువేనని అంటున్నారు. చిత్రారామచంద్రన్‌కు అవకాశం దక్కితే రాష్ట్రానికి మొదటి మహిళా సీఎస్ అవుతారు.
అదర్ సిన్హా, సోమేశ్ కుమార్, శాంతికుమారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదర్ సిన్హా ప్రస్తుతం సాధారణ పరిపాలనాశాఖ వ్యవహారాలు చూస్తున్నారు. కీలకమైన రెవెన్యూలోని అన్ని విభాగాల బాధ్యతలు సోమేశ్ కుమార్ చూస్తున్నారు. శాంతికుమారి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ పిక చేయనున్నారు.