రాష్ట్రంలో కొత్తగా నీరా విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు 40 లక్షల మంది గౌడ కులస్తులకు పరోక్షంగా ప్రయోజనం కలిగించే ఈ నీరా విధానం ద్వారా నేరుగా మూడు లక్షల మంది గీత కార్మికులు లబ్ది పొందుతారు. భారతదేశంతోపాటు శ్రీలంక, ఆఫ్రికా, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్‌లలో నీరాను విస్తృతంగా వినియోగిస్తారు.
ఆల్కహాల్ ఉండదు...
సాధారణంగా నీరాను తాటి, ఈత, కొబ్బరి, జీలుగ చెట్ల నుంచి తీస్తారు. సూర్యోదయానికి ముందు చెట్టు నుంచి తీసే నీరాలో ఆల్కహల్ అసలు ఉండదు. తియ్యగా కొబ్బరి నీరులా లేత గోధుమ రంగులో ఉంటుంది. సూర్యరశ్మి తగిలిన వెంటనే దానిలో మార్పులు చోటు చేసుకుని రంగు తెల్లగా మారి ఆల్కహల్ 7శాతం వరకు ఉత్పత్తయి కల్లుగా మారుతుంది.
ధర బేరీజు..
సాధారణంగా ఈత, తాటి, టెంకాయ చెట్ల నుంచి తీసే కల్లు 650 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిన సీసా రూ. 20 నుంచి 25 వరకు ఉంటుంది. అదే ఔషధ గుణాలు కలిగిన నీరా అయితే కేవలం 250 మిల్లీలీటర్లు రూ. 15 నుంచి 20 ధరతో మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్న అధికారులు... ధర నిర్ణయంపై కసరత్తు చేస్తున్నారు.
చెట్ల పెంపకంపై దృష్టి...
లాభసాటిగా సరసమైన ధరలకు నీరాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ధరలపై కసరత్తు జరుగుతున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈత, తాటి చెట్ల నుంచి రోజుకు రెండు లీటర్లకు మించి నీరా వచ్చే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. వరంగల్ జిల్లా పాకాల ప్రాంతంలో ఉన్న కొన్ని చెట్లు రోజుకు 30 నుంచి 50 లీటర్లు వరకు నీరా ఇస్తున్నట్లు చెబుతున్న అధికారులు... నీటి సౌకర్యం కలిగిన చోట్ల ఆ చెట్ల పెంపకాన్ని చేపట్టాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కల్తీకి పాల్పడితే చర్యలే..
ఏడాదిలో నాలుగైదు నెలలు మాత్రమే నీరా ఉత్పత్తి అవుతున్నందువల్ల... ఏడాది పొడవునా నీరా అందుబాటులో ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నీరా ఉపాధి కల్పించడంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో దీనిని పెద్ద పరిశ్రమగా మారుస్తామని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా నీరా కల్తీకి పాల్పడితే అబ్కారీ శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని నీరా విధివిధానాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: ఇకపై కేదార్నాథ్ దారిలో మసాజ్ సేవలు...