పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయం.... సకాలంలో అందని విత్తనాలు, ఎరువులు. ఒకవైపు పంట నష్టాలు... మరోవైపు దళారుల రాజ్యం... ఆపై గిట్టుబాటు ధరల్లేమి... ఇలా కారణాలు ఏమైనా రైతుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదికలో వెల్లడించిన ఈ వివరాలు... సమస్య తీవ్రతకు అద్దంపడుతున్నాయి.
2018లో ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికను జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసింది. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలుగా విభజించి ఈ నివేదికను విడుదల చేయగా... రాష్ట్రంలో రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం చేసింది. వీరిలో మహిళా రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఏడాదిలో 908 మంది ఆత్మహత్య చేసుకోగా... ఇందులో సొంత భూమి ఉన్న రైతులు 720 మంది, కౌలుదారులు 180 మంది ఉన్నారు. వ్యవసాయ కూలీలు మరో 8 మంది ఉన్నారు. సొంత భూమి ఉన్న రైతుల్లో 83 మంది, కౌలుదారుల్లో 24 మంది మహిళలు ఉన్నారు.
వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుపోయి... దిక్కుతోచనిస్థితిలో ఆత్మహత్యలే శరణ్యంగా తనవు చాలిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రతకు తాజా నివేదిక అద్దం పడుతోంది.పశ్చిమ్‌బంగ్, బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని పేర్కొన్నాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.
ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీలకు గుర్తుల కేటాయింపు..