పురపోరు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పురపాలికల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కోసం షెడ్యూల్ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా షెడ్యూల్ను పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వార్డుల పునర్విభజన జాబితా ముసాయిదాను రేపు పత్రికల్లో ప్రచురిస్తారు. ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలకు ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉంటుంది. ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వవచ్చు. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభిప్రాయాల పరిష్కారానికి వారం రోజుల పాటు గడువు ఉంటుంది.
ఈనెల 17న తుది జాబితా విడుదల...
ఈ నెల 16వ తేదీలోగా వినతులు, సూచనలను పరిష్కరించి పాలకమండళ్లు లేదా ప్రత్యేకాధికారుల అభిప్రాయాలు, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను మొత్తం పూర్తి చేసి ఈ నెల 17న పురపాలక శాఖ సంచాలకులకు వార్డుల పునర్విభజన జాబితా అందించాలి. ఎన్నికలు జరగాల్సిన 121 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన తుదిజాబితాను అదే రోజు ప్రకటిస్తారు.
వార్డుల పునర్విభజన పూర్తయ్యాక రాష్ట్ర ఎన్నికల సంఘం... వార్డుల వారీ ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తుంది. ఆ జాబితాలకు అనుగుణంగా బీసీ ఓటర్ల వివరాలు సేకరించి ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రిజర్వేషన్ల వివరాలు అందగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నెల నాలుగో వారంలో పురపోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?