నీటి ఇబ్బందులు లేని నగరంగా హైదరాబాద్...
శాంతియుత నిరసనలకు తాము అడ్డుకోమన్నారు కేటీఆర్. దేశంలోనే హైదరాబాద్ శాంతియుత నగరమని.. ఆ ఖ్యాతిని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో ఎటువంటి నీటి ఇబ్బందులు లేవని... దేశంలోనే నీటి ఇబ్బందులు లేని నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని తెలిపారు. కాళేశ్వరం పూర్తితో నగరానికి మరింత నీటి దన్ను ఏర్పడిందన్నారు. మిడ్ మానేరును సీఎం కేసీఆర్తో కలిసి రేపు సందర్శిస్తామన్నారు. 2020 మొదటి అర్ధ సంవత్సరంలో టీహబ్ ఫేస్-2 ప్రారంభం కానుందని ప్రకటించారు. ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి తయారీ సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
జగన్ మంచి ప్రారంభాన్నిచ్చారు...
ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల మధ్య వైరుధ్యాలతో విసుగెత్తిపోయామని.. ఏపీలోనూ తెరాస పార్టీని విస్తరించాలని తెలంగాణలా సుస్థిర ప్రభుత్వం బలమైన నాయకత్వం కావాలని ఓ నెటిజన్ కోరిన కోరికకు.... కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రావిర్భావం సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వం లేదు అన్న నోళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారని... ఇదంతా సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమ వల్లేనని చెప్పారు. ఏపీకి మూడు రాజధానుల అంశం, రాజధాని, హైకోర్టే అభివృద్ధి కేంద్రాలా అని అడిగిన ప్రశ్నకు... అది ఏపీ ప్రజలు నిర్ణయించుకోవాలని బదులిచ్చారు. ఆరు నెలల జగన్ పాలనపై స్పందిస్తూ... సీఎంగా మంచి ప్రారంభాన్నిచ్చారని మంత్రి కితాబిచ్చారు.
పార్టీ పదవే నాకు విలువైంది...
రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం అతిపెద్ద సవాల్ అని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో సీఎం కేసీఆరే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్పీప్ చేయటం 2019లో తనకు గుర్తుండిపోయే జ్ఞాపకమన్నారు. మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు బాధ్యతల్లో ఏది ఫేవరెట్ అన్న ప్రశ్నకు.. పార్టీ వల్లే తనకు ఇంతటి ఖ్యాతి అని.. పార్టీ పదవే విలువైందని జవాబిచ్చారు.
ఇవే కాక, పలు రాష్ట్ర స్థాయి ప్రజల సమస్యలపై వ్యక్తిగతంగా స్పందిస్తూ.. పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!