రాష్ట్రంలోని సర్కారు పాఠశాల్లో విద్యార్థినులకు ఇక నుంచి 3 నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వనున్నారు. అమ్మాయిల ఆత్మరక్షణ శిక్షణ కోసం కోటీ 38 లక్షల 96 వేల రూపాయలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రభుత్వోన్నత పాఠశాలలు.. వందకు మించి విద్యార్థులున్న 1513 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో శిక్షణ ఉంటుంది.
వారంలో రెండు తరగతులు...
ఒక్కో పాఠశాలకు రూ. 3వేల చొప్పున మంజూరు చేసింది. వారంలో రెండు మార్షల్ ఆర్ట్స్ తరగతులను... గంట చొప్పున నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో ఈ తరగతులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. జాతీయ క్రీడా సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి జూడో లేదా మార్షల్ ఆర్ట్స్‌లో సర్టిఫికెట్ ఉన్న శిక్షకుడిని నియమించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. శిక్షకుడికి నెలకు రూ.3వేల వేతనాన్ని ప్రధానోపాధ్యాయుడు చెల్లిస్తారు. శిక్షణ పూర్తయ్యాక విద్యార్థినులు నేర్చుకున్న అంశాలతో ప్రదర్శన నిర్వహించాల్సి ఉంటుంది.
మార్షల్ ఆర్ట్స్ శిక్షణపై ప్రధానోపాద్యాయులకు తగిన ఆదేశాలు, సూచనలు ఇవ్వాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కోరారు. సమగ్ర శిక్షణ పథకంలో భాగంగా లింగ సమానత్వం కార్యక్రమంలో ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి: ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?