‘మా నాన్నకు పెళ్లి’.. ‘మా అమ్మకు పెళ్లి’ అంటూ దండోరా వేయించి మరీ సరిజోడును తెచ్చిపెడుతున్నారు. గతంతో పోల్చితే కన్నవారి పట్ల పిల్లల ఆలోచనా ధోరణి మారుతోందని ‘తోడు-నీడ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు రాజేశ్వరీదేవి తెలిపారు. తాను చవిచూసిన మనోవేదన నేపథ్యంలో ఒంటరి పండుటాకులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో పదేళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ ద్వారా 200 మందిని జంటలుగా చేశామని చెప్పారు. ఒక్క సంస్థ ద్వారా అన్ని వివాహాలు జరిగాయంటే.. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా పెద్దసంఖ్యలో జరిగి ఉంటాయని అంచనా వేయొచ్చు. గతంలో ఇలాంటి వివాహాలను వ్యతిరేకించి వారికి దూరంగా ఉన్న కుటుంబాలు కూడా క్రమంగా దగ్గరవుతుండటం శుభపరిణామంగా చెబుతున్నారు.
తీపి.. చేదుల కలయిక
కుల, మతాలకు అతీతంగా ఒక్కయ్యే వృద్ధ జంటలకు కొన్నిసార్లు చికాకులు తప్పట్లేదు. తండ్రి/తల్లి మరోపెళ్లి చేసుకుంటే ఆస్తిపాస్తులు కోల్పోవాల్సి వస్తుందనే భయంతో కొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులే అడ్డుగోడగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సహజీవనం వైపూ మొగ్గుచూపుతున్నారు. ఇలా ఒక్కటవుతున్న అధికశాతం వృద్ధజంటలు ఇద్దరిలో ఏ ఒక్కరు ముందుగా మరణించినా.. బతికున్న వారు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.
50-55 ఏళ్ల వయసులో జీవితభాగస్వామి దూరమై తోడు కోసం అంతర్జాల వివాహ వేదికల్లో వెతికేవారు పెరిగారని.. ఓ మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి తెలిపారు. బంధువులకు దూరంగా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు ముసలితనంలోనూ ధైర్యంగానే పెళ్లి చేసుకుంటున్నట్లు మరో బ్యూరో ప్రతినిధి వివరించారు.
ఆనందంగా ఉంటున్నాం
1982లో 31 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయా. పెద్దగా చదువుకోలేదు. పిల్లలిద్దరినీ ప్రయోజకుల్ని చేశా. అరవై ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలా. తోడు-నీడ సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి వెళ్లా. అక్కడే కోటేశ్వరరావు పరిచయమయ్యారు. ఆయనకు పిల్లల్లేరు. 2013లో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు విదేశాల్లో ఉన్న మా పిల్లలిద్దరూ యోగక్షేమాలు అడుగుతుంటారు. -రాజేశ్వరి, విజయవాడ
బిడ్డల సంస్కారానికి నిదర్శనం
నాకు ముగ్గురు పిల్లలు. ఆస్తిపాస్తుల గొడవల్లేవు. పదవీ విరమణ చేశాక.. నా ఒంటరితనాన్ని దగ్గరగా గమనించారు. నా అభిప్రాయాన్ని సంస్కారంతో గౌరవించిన నా బిడ్డల సాక్షిగా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించా. బంధువులు దూరంగా ఉంచారు. వివాహ కార్యక్రమాలకు పిలుపుల్లేవు. ప్రస్తుతం మేమిద్దరం.. ఆధ్యాత్మిక సేవలో గడుపుతున్నాం. ఒంటరితనంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు సానుకూలంగా ఉండాలి. పరిణతితో ఆలోచించాలి. -రాజగోపాల్, మదనపల్లి
మరింత అవగాహన పెరగాలి
ఆర్థిక సంబంధాలకు అతీతంగా అమ్మానాన్నల ఆనందాన్ని కోరుకుంటున్న పిల్లలు దగ్గరుండి వారి పెళ్లి జరిపిస్తున్నారు. వృద్ధుల వివాహాల పట్ల సమాజంలో మరింత అవగాహన పెరగాలి. జిల్లాలవారీగా వివాహ పరిచయ వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. చట్టబద్ధంగా అన్నీ సక్రమంగా ఉంటేనే ఇటువంటి వివాహాలు జరిపిస్తున్నాం. యాభై ఏళ్లకు పై బడిన వారు మాత్రమే మా సంస్థ ద్వారా ద్వితీయ వివాహానికి అర్హులు. -ఎన్.ఎం.రాజేశ్వరీదేవి, ‘తోడు-నీడ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, హైదరాబాద్
ఆమె..
అరవయ్యేళ్ల జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. మూడు పదుల వయసులోనే భర్త దూరమవడంతో కన్నీటి ప్రయాణం. రెక్కలొచ్చి బిడ్డలు ఎగిరిపోవడంతో ఒంటరిగా మారింది. మిగతా జీవితాన్ని తనకోసం బతకాలని నిర్ణయించుకుంది. తల్లి మనసులో మాట బయటపెట్టగానే పిల్లలు తొలుత వద్దని వారించారు. చివరకు తమ తల్లి మాటను గౌరవించి విశ్రాంత ఉద్యోగితో వివాహానికి సమ్మతించారు. హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లిని మొదట్లో అంగీకరించని బంధువులు, స్నేహితులు.. తరువాత ఆదరించారు.
ఆయన..
అధ్యాపకుడిగా ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. భార్యా పిల్లలకు ఏ లోటూలేకుండా చూసుకున్నారు. పదవీ విరమణ చేసిన పదిరోజులకే జీవిత భాగస్వామిని రోడ్డు ప్రమాదం దూరం చేసింది. ఒంటరితనంతో కుంగుబాటుకు గురైన తండ్రికి అమెరికాలో ఉంటున్న పిల్లలు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా తోడు వెతికారు. ఓ దేవాలయంలో ఇద్దరినీ ఒక్కటి చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ విశాఖపట్నంలో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
యువతి..
న్యాయవాద విద్య అభ్యసిస్తున్న ఓ యువతి యాభై ఏళ్ల వయసున్న తన తల్లికి వరుడు కావాలంటూ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేశారు. శాకాహారి అయి ఉండి.. ఎలాంటి దురలవాట్లు లేని వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు ఆమె వివరించారు. ఒంటరితనంతో బాధ పడుతున్న అమ్మకు తోడు వెతకాలనే బిడ్డ ఆలోచనకు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు.