చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని ఉభయ సభాపతులు కోరారు. శాసనసభ, మండలి కమిటీల ఛైర్పర్సన్ల మొదటి సమావేశంలో మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉభయ సభల కమిటీల ఛైర్పర్సన్లతో పాటు చీఫ్ విప్‌లు, విప్‌లు పాల్గొన్నారు.
ప్రజాపాలనలో కీలక పాత్ర పోషించాలి...
చట్టసభల కమిటీలకు సంబంధించిన రెండు పుస్తకాలను సమావేశంలో విడుదల చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి ఉందన్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... కమిటీలు తరచూ సమావేశం కావడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. ప్రజా పాలనలో కీలక పాత్ర పోషించే బాధ్యత కమిటీ సభ్యులపైన ఉందన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి... మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. కమిటీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతున్నాయో... లేదా చూడాలని సూచించారు.
ఆర్నెళ్లకోసారి సమావేశం...
వివిధ పథకాల కొరకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా కమిటీలు పరిశీలించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అన్ని కమిటీల ఛైర్మన్ల సమావేశం నిర్వహించడం మంచి సంప్రదాయమని ఛైర్మన్లు తెలిపారు. ప్రతి ఆర్నెళ్లకోసారి సమావేశం నిర్వహించాలని ఛైర్మన్లు కోరిన కోరికమేరకు... సభాపతి పోచారం అంగీకారం తెలిపారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు