రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న దాదాపు మూడు వేల మంది అభ్యర్థులతో గురువారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ జరిపారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించారు. కేటీఆర్ ముందుగా అభ్యర్థులకు ఫోన్ చేసి స్వయంగా మాట్లాడారు. వారిని వివిధ ప్రశ్నలడిగారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
తెలంగాణలో పురపాలక, నగరపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు వేసిన ప్రశ్నలివి.
- కొత్త పురపాలక చట్టం చదివారా? అందులో ఏముంది?
- రూల్స్ పాటించకపోతే తీసేస్తామని తెలుసా?
- మీరు ఎందుకోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు?
- ఏంచేయాలనుకుంటున్నారు?
- రోజూ ఎన్ని ఇళ్లు తిరుగుతున్నారు? ఏం చెబుతున్నారు?
- మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలేమిటి?
- మీ మంత్రి, ఎమ్మెల్యేలు వచ్చారా?
- సమన్వయం ఎలా ఉంది?
- ఏమైనా సమస్యలున్నాయా?
ఒక్కో ఇంటికి మూడు నుంచి ఐదుసార్లు
పుర, నగర పాలక ఎన్నికల్లో అభ్యర్థులు ఉద్ధృతంగా ప్రచారం చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు. ఒక్కో ఇంటికి మూడు నుంచి ఐదుసార్లు వెళ్లాలని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేస్తే ప్రజలంతా తెరాసనే గెలిపిస్తారన్నారు. విపక్షాల్లో ఇప్పటికే తీవ్ర నైరాశ్యం అలుముకుందన్నారు. భాజపా వేయి, కాంగ్రెస్ 500 పైగా స్థానాల్లో పోటీ చేయకపోవడం తెరాస తిరుగులేని విజయాన్ని సూచిస్తోందన్నారు. గెలుస్తామని ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. కాంగ్రెస్, భాజపా పార్టీలకు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. పార్టీ కార్యకర్తలతో ప్రతి వార్డులో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ‘మన విజయం తథ్యం. అన్ని సర్వే నివేదికలు దీనిని స్పష్టం చేస్తున్నాయన్నారు.
గత ఆరు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి..
కాంగ్రెస్ పాలనను తెరాస పాలనతో బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. అభ్యర్థులు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో పనిచేయాలన్నారు. తెలంగాణలోని పురపాలికలను దేశంలోనే అదర్శవంతమైన వాటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త పురపాలక చట్టం తెచ్చాం. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అనుభవంలో ఉన్నాయి. పురపాలక సంఘాలతో పాటు ప్రతి వార్డుల్లో అవసరాలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయాలని కేటీఆర్ సూచించారు. ఫలితాల తర్వాత గెలిచిన వారితో సమావేశమవుతాం’ అని కేటీఆర్ చెప్పారు. పార్టీ పురపాలక సమన్వయకర్తలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, గట్టు రాంచందర్‌రావు, దండెవిఠల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 350 ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం... భూలక్ష్మీ చెన్నకేశవ ఆలయం