తెలంగాణ భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీనేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ స్థానాలు గెలుచుకోవాలని.. సూచించారు. విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అసంతృప్తులను బుజ్జగించే పనిని జిల్లా నాయకత్వం చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తెరాస ప్రభుత్వ పనితీరుపై సానుకూలంగా ఉన్నారని.. వారికి కేసీఆర్ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతోందని... వాటిని ఓట్ల రూపంలో మలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు.
తెరాసలోనే పోటీ పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అవకాశం రానివారూ నామినేషన్ వేశారని... వారందర్ని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు అవకాశం రాకపోతే భవిష్యత్‌లో పార్టీ పదవులు ఉన్నాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని పుర, నగర పాలికలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.