ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఐటీ, పరిశ్రమలశాఖా మంత్రి కేటీ రామారావు ఇవాళ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఫోరం 50వ వార్షిక సదస్సు దావోస్ వేదికగా రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. సంస్థ ప్రత్యేక ఆహ్వానం మేరకు కేటీఆర్ సమావేశాల్లో పాల్గొననున్నారు. మంత్రి ఈ సదస్సుకు హాజరు కావడం రెండోసారి. 2018 సదస్సులో పాల్గొన్న ఆయన... 2019లో హాజరు కాలేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ వార్షిక సదస్సు అయినందున మంత్రి ఈసారి హాజరవుతున్నారు.
ప్రభుత్వ అనుభవాలపై వివరణ..
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అధిపతులు, కేంద్రమంత్రులు, కంపెనీల సీఈఓలు, అధిపతులు సదస్సులో పాల్గొననున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో టెక్నాలజీ ప్రయోజనాలు- ఎదురయ్యే సవాళ్లను తగ్గించడం అనే అంశంపై చర్చించాల్సిదిగా మంత్రి కేటీఆర్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. వీటితోపాటు సదస్సులో వివిధ అంశాలపై జరిగే చర్చల్లోనూ తెలంగాణ ప్రభుత్వ అనుభవాలను వివరించాల్సిందిగా సూచించింది.
రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రోత్సహకాలు..
సదస్సుకు హాజరయ్యే వివిధ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పారిశ్రామిక రంగానికి ఇస్తోన్న ప్రోత్సాహం, ఇప్పటి వరకు పురోగతిని వారికి వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం గురించి పారిశ్రామికవేత్తలకు తెలుపుతారు. ఐటీ రంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోన్న ఫార్మా, లైఫ్ సైన్సెన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహకాలను వారికి చెప్తారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా పెవిలియన్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు. రాష్ట్రానికి చెందిన ప్రతినిధి బృందం ఇప్పటికే దావోస్ చేరుకొంది. ఈ నెల 23న కేటీఆర్ తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
ఇవీ చూడండి:క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం