భాగ్యనగర వాసులకు మరో మెట్రో రైలు కారిడార్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొదటి కారిడార్ మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్, మూడో కారిడార్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉంది. మిగిలిన రెండో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గత 45 రోజుల నుంచి ప్రయోగాత్మక పరుగు నిర్వహించారు. నిత్యం ఈ సమాచారాన్ని కెనడాలోని థాలెస్ సంస్థకు అందించారు. మెట్రో ఆటోమెటిక్‌గా నడిచే సీబీటీసీ సాంకేతికతను ఈ సంస్థ అందించింది.
18 రకాల భద్రత తనిఖీలు
ఈ కారిడార్‌లో 18 రకాల భద్రత తనిఖీలను మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ ఇవాళ నిర్వహించారు. ఆయనతో పాటు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్ట్స్ , ఎస్కలెటర్లు, ట్రాకులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సిగ్నలింగ్‌కు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి తుది అనుమతుల పత్రాన్ని మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ అందించారు.
11 కిలోమీటర్ల పొడవు
ఇక ప్రభుత్వం నిర్ణయం అనంతరం ప్రజలకు ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ తదితర స్టేషన్లు ఉన్నాయి. కారిడార్ పొడవు 11 కిలోమీటర్లుగా ఉంది.
సీఎం ప్రారంభించే అవకాశం
మొదటగా సంక్రాంతి పండుగ వరకు జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్‌ను ప్రారంభించేందుకు అధికారులు యుద్దప్రాతిపాదికన పనులు చేపట్టారు. కానీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రారంభం కొద్ది రోజుల ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 25వ తేదీ అనంతరం సీఎం కేసీఆర్ ఈ మెట్రో కారిడార్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్