హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో దొరుకుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులు పట్టుకుని.. కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నా... వారాంతంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ యువత ప్రమాదాలకు కారణమవుతోంది. నవంబరు 29, 30 తేదీల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మందు బాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ 345 మంది పట్టుబడగా.. అందులో 212 మంది ద్విచక్ర వాహనదారులు, 12 మంది ఆటోవాలాలు, 117 మంది కార్ల నడిపే వారు, 4 లారీ డ్రైవర్లు ఉన్నారు.
యువతే అధికం
అత్యధికంగా ఐటీ కంపెనీలు ఉన్న మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 92 మంది, గచ్చిబౌలిలో 60 మంది పట్టుబడ్డారు. వయసుల వారీగా తీసుకుంటే 21 నుంచి 30 ఏళ్లు కలిగిన వారు అత్యధికంగా 206 మంది కాగా... 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు 86 మంది, 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు 33 మంది ఉన్నారు.
అధిక మోతాదు
వృత్తుల వారీగా పరిశీలించిగా అత్యధికంగా 41 మంది ఐటీ ఉద్యోగులు, 40 మంది వ్యాపారులు, 33 మంది విద్యార్థులు, ఇతరులు 172 మంది ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. తాగిన మోతాదు తీసుకుంటే పరిమితికి మించి మద్యం సేవించిన మందుబాబులే అధికంగా ఉన్నారు. 50 పాయింట్లులోపు మోతాదు నమోదైన వారు 76 మంది ఉండగా, 50 నుంచి 100 పాయింట్లు నమోదైన వారు 160 మంది, 100 నుంచి 150 పాయింట్ల నమోదైన వారు 63 మంది, 151 నుంచి 200 పాయింట్ల మధ్య పట్టుబడిన వారు 27 మంది, 201 నుంచి 250 మధ్య పాయింట్లు నమోదైన వారు 10 మంది ఉన్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ'