నేనుంటే.. బాహుబలులే!
- మీరు ఆటల్లో చురుగ్గా ఉండాలన్నా.. శారీరకంగా బలంగా ఉండాలన్నా.. చివరికి మీరు మీ స్కూల్‌బ్యాగు మోయాలన్నా.. మీ శరీరంలో నేను ఉండాల్సిందే.
- ఎందుకంటే మీలో కండరాలు, ఎముకలు, కీళ్లు బలంగా ఉండటానికి కారణం నేనే. అంతే కాదండోయ్... మీ జ్ఞాపకశక్తి మెరుగుపడాలన్నా.. మీరు నేర్చుకున్న పాఠాలు ఎక్కువ రోజులు గుర్తుండాలన్నా.. నన్ను తగిన మోతాదుల్లో తీసుకోవాల్సిందే. మీరు పెద్దయ్యాక మీకు అల్జీమర్స్ రాకుండా కాపాడేది కూడా నేనే మరి.
- మీ చర్మం నిగనిగలాడాలన్నా.. మీ జుట్టు తళతళా మెరవాలన్నా.. నేనే కారణం. నేను తక్కువైతే మీ చర్మం నిగారింపు కోల్పోతుంది. ముఖ్యంగా మొహంలో కళ తప్పుతుంది! జుట్టు సైతం రాలిపోతుంది. వెంట్రుకలూ తెల్లబడతాయి.
- కళ్లు బాగా కనబడాలంటే కేవలం ఏ విటమినే కాదూ.. ‘ఇ’ విటమిన్ అయిన నేను సైతం ఉండాలి. మీ కంటి చూపు మెరుగుపరచడంలోనూ నేనూ ఓ చెయ్యేస్తా అన్నమాట.
నా తోడుంటే.. ఆరోగ్యం మీ వెంటే!
- మీ శరీరంలో వ్యాధికారకాలను తగ్గిస్తాను. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాను. హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడతాను. క్యాన్సర్ కారకాల భరతం పడతాను.
- రక్తకణాల వృద్ధి, రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాను. గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతా. అంటే ఓ రకంగా మీ గుండె ఆరోగ్యం నా చేతిలోనే ఉంటుంది!
- కేవలం గుండెనే కాదు.. ఊపిరితిత్తులనూ ఆరోగ్యంగా ఉంచుతాను. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలనూ నియంత్రిస్తుంటా.
ఏమేమి తినాలంటే..
- బాదం, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, గుమ్మడి కాయ విత్తనాలు, నువ్వులు వంటి గింజలు, బచ్చలి, పాలకూర, మామిడిపండు, బొప్పాయి, టమాటా, కివీ, బ్రకోలీ, ఆలివ్, అవకాడో తదితర ఆహార పదార్థాల్లో నేను ఉంటాను.
- నిజానికి మీకు రోజుకు కనీసం 7నుంచి 15మిల్లీగ్రాముల ‘ఇ’ విటమిన్ సరిపోతుంది. కానీ చాలా మందికి ఈ మొత్తం కూడా అందదు. అందుకే డాక్టర్లు సప్లిమెంట్ల రూపంలో అటువంటి వారికి నన్ను అందిస్తుంటారు.
- అంటే మీ శరీరానికి నేను ఇసుమంత అందినా చాలు.. మిమ్మల్ని.. మీ కండరాల్ని ఇనుములా తయారు చేస్తానన్నమాట.
- ఇంతకీ అసలు విషయం చెప్పనేలేదు కదూ! నేను మీ శరీరంలో తగ్గితే.. మీరు నీరస పడిపోతారు. నరాల సంబంధిత జబ్బులు వస్తాయి. కండరాలు బలహీనపడతాయి.
నా పేరుకు అర్థం పుట్టుక
- నన్ను మొట్టమొదటి సారిగా 1922లో కనిపెట్టారు. 1938నుంచి కృత్రిమంగా తయారు చేస్తున్నారు.
- నా రసాయన నామం టోకోఫెరాల్.
- టోకోఫెరాల్ అనేది గ్రీకు పదం. దీనికి అర్థం పుట్టుక.
- ఎలుకలపై సంతానోత్పత్తి విషయంలో చేసిన పరిశోధనల్లో పిండం ఏర్పడాలంటే నేను ముఖ్యమని తేలింది. అందుకే ‘ఇ’ విటమిన్‌ను అయిన నాకు టోకోఫెరాల్ అని పేరు పెట్టారు.
- అందుకే మీరంతా.. తినేటప్పుడు మారాం చేయొద్దు. నేను అది తినను..
ఇది నాకు వద్దు అని పేచీలు పెట్టొద్దు. హాయిగా పౌష్టికాహారం తినండి సరేనా... ఉంటా మరి... బైబై!
కె విటమిన్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !