ఏపీలోని అనంతరపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్లో ఓ సఫాయి వాలా తన నిజాయితీ చాటుకున్నాడు. తన తోటి సహచర మిత్రులు, అధికారులతో ఔరా అనిపించుకున్నాడు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే గుంతకల్లు రైల్వే స్టేషన్లో సఫాయి వాలాగా కాంట్రాక్టు పద్ధతిలో గన్నె రామాంజనేయులు విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయాన్నే తన విధులు నిర్వర్తిస్తుండగా సెప్టెంబర్ 2న 6వ నెంబర్ ప్లాట్ ఫామ్‌పై పడిఉన్న నగల బ్యాగ్‌ను చూశాడు. వెంటనే తన ఉన్నతాధికారులకు బ్యాగ్‌ను అందించాడు.
మూడు నెలలు తన వద్దే
అదే గుంతకల్లు జంక్షన్లో హెల్త్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అమర్నాథ్ మాత్రం దురుద్దేశంతో మొత్తం బంగారు ఆభరణాలను మూడు నెలలకు పైగా అనధికారంగా తన వద్దే ఉంచుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పటికి స్పందించిన జీఆర్పీ పోలీసులు విచారణ ప్రారంభించారు. మొదట్లో బంగారం సంగతి తనకేం తెలియదని బుకాయించిన అమర్నాథ్ ఎట్టకేలకు బంగారాన్ని పోలీసులకు అప్పచెప్పాడు.
బదిలీ
పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు... ఎవరినీ విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకురాలేదని చెప్పిన సిబ్బంది మరో ద్వారం గుండా అమర్నాథ్ను పంపించేశారు. అది గమనించిన విలేకరులు.. అతడిని వివరణ అడగడానికి ప్రయత్నిస్తే ఆగకుండా పరుగులు తీశాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారిని మరో ప్రాంతానికి బదిలీచేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు.
నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్
సెప్టెంబర్ 2న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు దంపతులు నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతున్న హడావుడిలో బంగారు నగలున్న బ్యాగ్‌ను ప్లాట్ ఫారంపై పోగొట్టుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు. మహారాష్ట్రలో బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని ఇద్దరు దంపతులు అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తమ విచారణలో తెలిసిందన్నారు.
ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి