ఆధునిక సాంకేతికత ఓ వైపు వరంగానూ, మరో వైపు శాపంగానూ మారుతోంది. ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలు చేస్తున్న వారు పెరుగుతున్నారు. తాజాగా ఓ కొత్త తరహా చోరీ ఘటన బయటకు వచ్చింది. రైలు ప్రయాణికుల కోసం ఆ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ సహాయంతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా హైటెక్ దొంగతనాలు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన పార్థి ముఠాలోని ఓ నాయకుడు అవినాష్ శ్రీరామ్ కాలేను రైల్వే పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
యాప్‌తో దోపిడీ
రైళ్లలో దొంగలు అంటే.. ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ ఎక్కువగా చోరీలు చేస్తుంటారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్, హరియాణా ముఠాలది మాత్రం వినూత్న పోకడ. రైళ్ల జాడ తెలుసుకునేందుకు ఉన్న యాప్‌లను దోపిడీలకు వాడుకుంటున్నారు.
- యాప్‌తో రైలు ఎక్కడుందో తెలుసుకుని తామున్నచోటుకు 5, 10 నిమిషాల్లో వస్తుందనగా.. అక్కడ సిగ్నల్ బాక్స్ తాళాన్ని పగలగొడుతున్నారు. దీంతో అప్పటివరకు ఉన్న గ్రీన్‌లైట్ స్థానంలో రెడ్‌లైట్ పడటంతో లోకోపైలెట్లు రైలు ఆపేస్తున్నారు. కిటికీలు తెరిచి నిద్రపోతున్న మహిళలు, ఇతర ప్రయాణికులే లక్ష్యంగా ఈ ముఠాలు దోపిడీ చేస్తున్నాయి. ఎత్తు సరిపోకుంటే.. ఒకరిపై ఒకరు ఎక్కి కిటికీలోంచి బంగారు గొలుసులు, ఇతర వస్తువులు లాక్కెళ్తున్నారు. ప్రతిఘటించిన వారిపై రాళ్లతో దాడి చేస్తున్నారు.
- అటవీప్రాంతాలు, జనావాసాలకు దూరంగా ఉన్న చీకటిప్రాంతాల్ని ఎంచుకుని సిగ్నల్ ట్యాంపర్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల స్టేషన్ దగ్గర పార్థి ముఠా సిగ్నల్ ట్యాంపర్ చేసి యశ్వంత్‌పూర్, జబల్‌పూర్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సిర్పూర్‌కాగజ్‌నగర్ మార్గంలో తాళ్లపోచంపల్లి, రాఘవాపూర్, ఆర్‌కేపూర్, మందమర్రి ప్రాంతాల్లో.. భువనగిరి సమీపంలో వంగపల్లి, పగిడిపల్లి వద్ద.. ఖమ్మం జిల్లాలో ఎర్రబాలెం వంటి ప్రాంతాల్లో ఈ తరహా దోపిడీలు ఎక్కువ జరుగుతున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.
మరింత ప్రమాదమే
ప్రస్తుత యాప్‌లలో రైళ్ల జాడ స్టేషన్లవారీగానే తెలుస్తుంది. త్వరలో రైల్వేశాఖ రియల్‌టైం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఆర్‌టీఐఎస్) అనే కొత్త యాప్ తీసుకురాబోతుంది. దీంతో 30 సెకన్లకోసారి రైలు జాడ మరింత కచ్చితంగా తెలిసిపోతుంది. ఈ సాంకేతికత వస్తే దోపిడీ ముఠాల పని మరింత సులవవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ట్యాంపరింగ్‌కు గురికాకుండా సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలంగాణ జీఆర్‌పీలో 540కి 300 మంది పోలీసులే ఉన్నారు. పలురైళ్లలో కొందరు భద్రత సిబ్బంది టార్చిలైట్, విజిల్‌తోనే విధులు నిర్వహిస్తున్నారు. ఖాళీలు భర్తీచేసి రాత్రిపూట రైళ్లలో తగినంత భద్రత సిబ్బందిని ఆయుధాలతో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి :ఒకప్పటి దర్శకుడు ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?