ఆర్టీసీ కార్మికులకు, యాజమాన్యానికి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూత్రప్రాయంగా నిర్ణయించింది. హైపవర్ కమిటీ ఏర్పాటుపై రేపటిలోగా అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డితో ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
ఎస్మా వర్తించదు
ఎస్మా ప్రకారం కార్మికుల సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించే అధికారం హైకోర్టుకు ఉంటుందని విద్యాసాగర్ వివరించారు. గతంలో 1998లో ఓసారి... 2015లో మరోసారి ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. అయితే 1998లో ఏపీఎస్ ఆర్టీసీని ఉద్దేశించిన జారీ చేసిన ఉత్తర్వులు టీఎస్ఆర్టీసీకి ఎలా వర్తిస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది. 2015లో జీవో జారీ చేసినప్పటికీ... ఆరు నెలల వరకే వర్తిస్తాయని అందులో పేర్కొన్నారని హైకోర్టు స్పష్టం చేసింది.
అధిక ఛార్జీలు వసూలు
బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ వాదించారు. అధిక ఛార్జీలు వసూలు చేసినా.. టికెట్ ఇవ్వకపోయినా.. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. కానీ ఈ కారణంగా సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించలేమని ధర్మాసనం పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం కానీ.. ప్రభుత్వం కానీ కార్మికులతో చర్చించేలా ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందా లేదా చట్టపరంగా వివరించాలని న్యాయవాదులను మరోసారి ధర్మాసనం ప్రశ్నించింది.
సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేం
మధ్యవర్తిత్వం ప్రక్రియ పెండింగ్లో ఉండగానే... కార్మికులు సమ్మెలోకి వెళ్లారని.. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ నివేదిక ఇచ్చారని.. అయితే హైకోర్టులో కేసుల విచారణ పెండింగ్లో ఉన్నందున.. తాము తదుపరి చర్యలు చేపట్టలేదని ప్రబుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని కొందరు... చర్చలు జరిపేలా సర్కారును ఆదేశించాలని మరికొందరు పిటిషన్లు వేశారని... అయితే ఏ ప్రాతిపదికన తాము ఆదేశాలు ఇవ్వొచ్చని రెండు రోజులుగా అడుగుతున్నప్పటికీ.. సరైన సమాధానం రావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపింది.
పలుమార్లు కోరినప్పటికీ...
తాము పలు మార్లు కోరినప్పటికీ... మాట వినడం లేదని.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు చెబితేనయినా సమస్య పరిష్కారమవుతుందని... చిన్న ఆశతో ఉన్నామని తెలిపింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం లేబర్ కోర్టు సరైన వేదిక అని అడ్వొకేట్ జనరల్ తెలపగా... హైకోర్టునే పట్టించుకోవడం లేదు ఇక లేబర్ కోర్టు ఏం చేయగలగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలను బుధవారం వరకు పొడిగించింది.
ఇవీ చూడండి: కుటుంబ కలహాలతో... కన్నవాళ్లే కడతేర్చారు...