మూసీ కాలుష్యంపై పదే పదే వ్యాఖ్యలు చేయడంతోపాటు పలు సూచనలు, ఆదేశాలిస్తున్న హైకోర్టు మూసీపై ఈనాడు కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఈనెల 18న మూసీ...బతుకు మసి శీర్షికతో ఈనాడు లో ప్రచురితమైన కథనంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ స్పందించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుని ధర్మాసనం ముందుంచాలంటూ రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి తరఫున సభ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ డైరెక్టర్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరిల కలెక్టర్లను పేర్కొన్నారు.
66 గ్రామాలపై ప్రభావం
వికారాబాద్-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని అనంతగిరి కొండల్లో పుట్టి ప్రవహిస్తున్న మూసీ.. మున్సిపాల్టీల మురుగునీటితో కలుషితమవుతోందని ఈనాడు తన కథనంలో పేర్కొంది. రాత్రి సమయాల్లో పారిశ్రామిక వ్యర్థాలను అక్రమంగా మూసీ నదిలోకి వదులుతుండటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సమీపంలోని 66 గ్రామాలపై దీని ప్రభావం పడుతోంది. 50 శాతం మంది ప్రజలు కీళ్ల నొప్పులు, దోమ కాటు వల్ల జ్వరాల బారిన పడుతున్నారు.
మురుగు నీటిని వదిలేస్తున్నారు
మత్స్యకారులు, రైతులు, రజకులు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా 1500 మిలియన్ లీటర్లకు గానూ 750 మిలియన్‌ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగిలిన మురుగును యథాతథంగా మూసీలోకి వదులుతున్నారు. మూసీ పరిసరాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఇవీ చూడండి : 'కాకతీయ మెగా జౌళి పార్కు, ఫార్మా సిటీ అభివృద్ధికి సహకరించండి'