ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి కోరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య కోసం ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం, ఆర్టీసీ ముందుకు రావడం లేదని కనీసం వాస్తవాలు చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేసింది. దేశం ఆశ్చర్యపోయే పథకాలు, ప్రాజెక్టులు చేపట్టిన ప్రభుత్వం... ఆర్టీసీపై కూడా ఔదార్యాన్ని చూపాలని సూచించింది. ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నట్లే... న్యాయవ్యవస్థకూ ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంటుందని గుర్తు చేసింది.
ఇలాగేనా వ్యవహరించేది?
అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు మరోసారి మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగా గజిబిజి అంకెలతో... అందమైన పదాలతో... చాలా తెలివి ఉపయోగించి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానంతో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించింది. న్యాయవ్యవస్థకు ప్రభుత్వం, అధికారులు ఇచ్చే గౌరవం ఇలాగేనా అని అసహనం వ్యక్తం చేసింది. రుణం అంటే అప్పు కాదని.. చాలా తెలివిగా చెబుతున్నారని ఇప్పటి వరకు ఏ బడ్జెట్లోనూ ఆ విధంగా చూడలేదని వ్యాఖ్యానించింది.
సరైన సమాధానాలే కోర్టుకు కావాలి...
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించామని రెండో నివేదికలో పేర్కొన్నారని.. అంటే మొదటి నివేదిక రికార్డులు చూడకుండానే ఇచ్చారా అని ప్రశ్నించింది. సమయం లేక తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా మొదటి నివేదిక ఇచ్చామని... ఆ తర్వాత కాగ్ నివేదికలు కూడా పరిశీలించి ఇచ్చామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేరుగా వివరణ ఇచ్చారు. మన్నించాలని రామకృష్ణరావు కోరగా... క్షమాపణ కోరడం సమస్యకు పరిష్కారం కాదని.. కోర్టుకు సరైన సమాధానాలు చెప్పాలని పేర్కొంది.
ఇంకా అతనిని ఎందుకు కొనసాగిస్తున్నారు...
రవాణా శాఖ మంత్రినే తప్పుదోవ పట్టించడమే కాకుండా.. ఆవిషయాన్ని కోర్టు ముందు అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి ద్వారా సీఎంను, కేబినెట్‌ను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని మందలించింది. తప్పుదోవపట్టించిన ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీని ఆ స్థానంలో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత లేనప్పడు... జీహెచ్ఎంసీని ఎందుకు పదేపదే అడుక్కుంటున్నారని సూటిగా ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ డబ్బులు ఇవ్వాల్సి ఉందని మంత్రికి ఎందుకు చెప్పారని అడిగింది. తన 15 ఏళ్ల సర్వీసులో ఇంత దారుణంగా తప్పుడు నివేదికలు సమర్పించిన ప్రభుత్వ అధికారులను ఎప్పుడూ చూడలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు.
మాకు అలాంటి ఉద్దేశం లేదు...
అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని... అయితే అది సమస్యకు పరిష్కారం కాదని భావిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో కానీ... అధికారులతో కానీ ఘర్షణ పడే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని పేర్కొంది. తమ బాధంతా ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైనేనని స్పష్టం చేసింది. సర్కారు, అధికారులతో స్నేహపూర్వక సంబంధాలు ఉండాలన్నదే తమ అభిమతమని... పాలన వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే న్యాయవ్యవస్థ లక్ష్యమన్నారు. తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు... అధికారుల హాజరుకు మినహాయింపునిచ్చింది.
ఇదీ చూడండి: 'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు'