రాజాసాహెబ్, రసూల్‌బీ దంపతులు... ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామవాసులు. తమ కుమార్తె ఇమామ్‌బీకి డోన్‌కు చెందిన ఖలీల్‌తో మేనరిక వివాహం చేశారు. వారికి ఖాదర్‌బాషా, చాంద్‌బాషా పుట్టారు. తర్వాత కొన్ని రోజులకు ఖలీల్ అనారోగ్యంతో మరణించారు. నరాల బలహీనత కారణంగా మంచానికే పరిమితమైన కుమారులను తీసుకుని ఇమామ్‌బీ తల్లిదండ్రుల చెంతకు చేరారు. రసూల్‌బీ ఇంటి దగ్గర పిల్లలను చూసుకుంటుంటే... తండ్రి, కుమార్తె కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకొన్నారు. పిల్లల్ని ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది.
ప్రస్తుతం ఖాదర్‌బాషాకు 20 ఏళ్లు, చాంద్‌బాషాకు 19 ఏళ్లు. కొంతకాలం కిందట రసూల్‌బీ పక్షవాతంతో మంచం పట్టారు. ఇటీవల కింద పడటంతో రాజాసాహెబ్‌కు కాలు విరిగింది. నలుగురి అవసరాలనూ ఇమామ్‌బీనే తీరుస్తున్నారు. ఆమె లేకపోతే వారికి ఒక్కక్షణం గడవదు. పిల్లలకు వచ్చే దివ్యాంగుల పింఛనే వారికి దిక్కవుతోంది. అందరిపేర్లూ ఒకే రేషన్‌కార్డులో ఉండటంతో తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఇవ్వడం లేదు. తల్లిదండ్రుల్లో ఒకరికి పింఛన్ ఇస్తే ఆ డబ్బుతో వైద్యం చేయించుకుంటామని ఇమామ్‌బీ అధికారులను కోరుతున్నారు. ఆదుకునే దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవీ చూడండి:గజ్వేల్... ప్రగతి జిగేల్ !