హైదరాబాద్ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు... కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను దించి ముందుకు కదిలింది. అదే సమయంలో కర్నూలు నుంచి సికింద్రాబాద్ వెళ్లే హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆగేందుకు వస్తోంది. ప్రధాన లైను నుంచి లూపు లైను ద్వారా నాలుగో నెంబర్ ప్లాట్‌ఫారం వద్దకు చేరుకోవడానికి హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ వస్తుండగా ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్లేందుకు వేగాన్ని అందుకుంది. అంతే వేగంతో హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఎంఎంటీఎస్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని పక్కకు ఒరిగిపోయాయి. కొంతమంది ప్రయాణికులు కింద పడిపోయారు. సీట్లలో కూర్చున్నవారు కిందకు జారీ ప్రమాదానికి గురయ్యారు. మొత్తం 18 మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ అనురాధమ్మ, పి.శేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ సులోచన, అంజనేయులు, మహమూద్ అలీ, ప్రభాకర్, రాజ్‌కుమార్, ఆర్.మౌనిక, మిరాజ్ బేగం, బలరాం, మల్లమ్మ, ఆనంద్‌లకు ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు.
ఏడు నిమిషాల్లో..
కర్నూల్-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో సిగ్నల్ కోసం కాచిగూడ రైల్వే స్టేషన్ బయట చాదర్‌ఘాట్ బ్రిడ్జీపై నిలిపివేశారు. 10 గంటల 35 నిమిషాలకు ఇంటర్‌సిటీకి స్టేషన్‌లోకి రావడానికి సిగ్నల్ ఇచ్చారు. ఇది రైల్వే స్టేషన్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌ఫారం పైకి వెళ్తుంది. ప్లాట్‌ఫారం-2పై ఉన్న లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు అప్పుడే కాచిగూడ స్టేషన్ నుంచి మలక్‌పేట వైపునకు బయలుదేరింది. 10 గంటల 42 నిమిషాలకు క్రాసింగ్ వద్ద నాలుగో నెంబర్ ప్లాట్‌ఫారం వైపునకు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ రైలులోని 6 బోగీలు, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లోని 3 బోగీలు పట్టాలు తప్పాయి.
లోకోపైలట్ సురక్షితం:
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని దక్షిణ మధ్య రైల్వే సహాయ జనరల్ మేనేజర్ బీబీసింగ్, హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ సీతారాం ప్రసాద్, రైల్వే ఉన్నతాధికారుల బృందం సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. రైళ్ల పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. రైల్వే ముఖ్య వైద్యాధికారిణి నాగప్రసూనాంద, ఏపీఎంఎస్ రమీందర్ కౌర్ ఆధ్వర్యంలో రైల్వే వైద్య సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఏజీఎం బీబీసింగ్ తెలిపారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకున్న లోకోపైలట్ చంద్రశేఖర్‌ను రైల్వే సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ ధాటికి నుజ్జయిన ఎంఎంటీఎస్ క్యాబిన్ నుంచి లోకోపైలెట్‌ను తీయడం కష్టమైంది. ఆక్సిజన్ అందించి.. సెలైన్లు ఎక్కించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల 40 నిమిషాల వరకు శ్రమించి లోకోపైలట్‌ను బయటకు తీశారు. నడుముతో పాటు కాలికి తీవ్ర గాయాలైన చంద్రశేఖర్‌ను కేర్ ఆసుపత్రికి తరలించారు.
రైళ్లు రద్దు:
ప్రమాదం కారణంగా 12 ఎంఎంటీఎస్, 16 ప్యాసింజర్, 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. 21 ఎంఎంటీఎస్, 15 ప్యాసింజర్, 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మల్లించారు.
ఇవీచూడండి: ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇచ్చారా?