హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ పాల్గొన్నారు. 'స్వరాష్ట్రంలో సుపరిపాలన' అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలు చేపట్టినట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు.
అతి తక్కువ సమయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గతేడాది నుంచే నీటిని ఎత్తిపోస్తోందని వివరించారు. ఈ ఏడాది నుంచి ప్రతి రోజు 2 టీఎంసీల చొప్పున, వచ్చే ఏడాది నుంచి రోజూ 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసే ప్రణాళికలు రూపొందించినట్లు తమిళిసై పేర్కొన్నారు. రాబోయే కాలంలో పలు ప్రాజెక్టులు రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు సత్ఫలితాలిచ్చాయని గవర్నర్ చెప్పారు. ప్రపంచంలోనే బెస్ట్ లివబుల్ సిటీగా భాగ్యనగరం నిలిచిందన్నారు. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు జరిపి.. వాటి ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచికను రూపొందించే కార్యక్రమం త్వరలోనే మొదలు కానున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రం అనతికాలంలోనే అత్యున్నత ఫలితాలు సాధించిందని.. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని తమిళిసై కోరారు.
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం