గొల్ల, కురుమలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ చేపట్టింది. ఈ ఏడాది వేసవికాలంలో మేత, తాగునీటి కొరత, అనుకూలించని వాతావరణ పరిస్థితుల దృష్టిలో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. జాప్యం తర్వాత సెప్టెంబరు చివరి వారంలో రెండో విడత ప్రారంభించారు. 5 వేల రూపాయలు కోట్ల ఖర్చు చేసి మిగిలిన లబ్ధిదారులకు జీవాలు అందజేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ఆపండి...
తొలి విడతలో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో రెండో విడతలో నిబంధనలు మార్చారు. ప్రతి నెలా ఒక్కో జిల్లాకు 125 యూనిట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు పంపిణీ ప్రక్రియ మొదలై మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పంపిణీ ఆపాలంటూ తాజాగా ఆదేశాలు వచ్చాయి.
కొత్త డీడీలు తీసుకోవద్దు...
రాష్ట్రవ్యాప్తంగా 7.23 లక్షల మంది లబ్ధిదారులుండగా తొలివిడతలో 3లక్షల 85వేల 712 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. అప్పటికే డీడీలు కట్టిన మరో 25వేల 320 మందికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వాలని, కొత్తగా డీడీలు తీసుకోవద్దని ముందుగానే చెప్పారు. ఈ 25 వేల మందిలో సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందినవాళ్లు 100 మంది కూడా ఉండరని... గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం నాయకులు చెబుతున్నారు.
డీడీలు కట్టిన వారికీ ఇవ్వొద్దు...
డీడీలు కట్టిన వాళ్లతో సహా పంపిణీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు మరో 3.63 లక్షల మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా డీడీలు తీసుకోవద్దని, డీడీలు కట్టిన వారికి సైతం గొర్రెలు పంపిణీ చేయవద్దని చెప్పడంతో... జీవులు ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.
గొర్రెల పంపిణీకి నిధులు సమీకరణ, పథకాన్ని మరింత సమర్థంగా అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపొందించడం కోసమే... పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పినట్లు తమ దృష్టికి వచ్చిందని.. గొర్రెలు, మేకల సమాఖ్య అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్