హైదరాబాద్ ఎంతో గొప్ప నగరంగా పేరొందుతోంది. ఈ మహానగరంలో కోటీశ్వరులున్నారు. పట్టెడన్నం దొరకని నిరుపేదలు ఉన్నారు. గుడిమల్కాపూర్‌లో నవోదయ కాలనీలోని ఓ పాఠశాలలో హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది. ఓ చిన్నారి తినడానికి అన్నం లేక పాఠశాల మధ్యాహ్న భోజనం కోసం తరగతి గదిలోకి చూస్తుంది. విద్యార్థులు తినగా మిగిలిన ఆహారం తమకు పెడతారనే ఆశతో చేతిలో గిన్నె పట్టుకుని గంట ఎప్పుడు మోగుతోందో అని తరగతి గది ముందు నిరీక్షిస్తోన్న చిత్రం ఈనాడులో ప్రచురితమైంది. ఈ చిత్రం విద్యాశాఖ అధికారులను కదిలించింది. ఆ బాలికకు పాఠశాలలో ప్రవేశం కల్పించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం స్పందన....
గుడి మల్కాపూర్ నవోదయ కాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద పట్టెడన్నం కోసం ఓ చిన్నారి తరగతి గదిలోకి చూస్తున్న ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ఆరా తీసింది. బస్తీలోని పేద పిల్లల కోసం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు... వాటి అమలు తీరు ఎలా ఉంది అనే అంశాలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. పేద పిల్లల ఆకలి తీర్చడం కోసం తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించింది..
ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు