పైవంతెనపై మొత్తం నలుగురు మృతి:
ప్రమాద స్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనా పరిశీలించారు. గచ్చిబౌలీలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బయోడైవర్సిటీ కూడలి వద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. రాయదుర్గం వైపు నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు ప్లైఓవర్ మీదుగా వెళ్లే విధంగా నిర్మించారు. నవంబర్ 4న ఫ్లైఓవర్ అందుబాటులో వచ్చింది. నాలుగు రోజుల్లోనే పై వంతెనపై ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. అదే నెల 9న అర్ధరాత్రి పై వంతెనపై సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టగా.. కిందపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. రెండు వారాల వ్యవధిలో కారు ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల పైవంతెన విషయంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సుమారు కిలో మీటరు పొడవున్న ఈ పైవంతెన మధ్యలో ఉన్న మూల మలుపు కాస్త ప్రమాదకరంగా ఉండటం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. పైవంతెన మధ్యలో ఎత్తు 19మీటర్లున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వేగంగా వెళ్లడం వల్ల మూలమలుపును గమనించక రక్షణగోడను ఢీకొట్టాడు.
సూచికలు ఉన్నా..
ఈ నెల 9న జరిగిన ప్రమాదంతో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు 40కి.మీల వేగంతోనే వెళ్లాలనే సూచిక బోర్డులతో పాటు... మలుపు ఉన్న దగ్గర హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. వాహనదారులు ఎవరూ అక్కడ నిలవకుండా... మైకుల్లో హెచ్చరికలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అతివేగం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు కూడా ఎక్కువగా ఉందని వాహనదారులు చెబుతున్నారు.
మూసివేత..
ప్రమాదం పట్ల పురపాలక మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పై వంతెనను వెంటనే మూసేసి.. ప్రమాదానికి గల కారణాలను నిపుణులతో అధ్యయనం చేయించాలని జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు సూచించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం పైవంతెనలో మార్పులు తీసుకొచ్చిన తర్వాత... తిరిగి రాకపోకలను అనుమతించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం