తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబురాల్లో మునిగితేలనున్నాయి. అత్తింటికొచ్చిన కొత్త అల్లుళ్ల సందడి, బావ మరదళ్ల సరదాలు... పగలంతా ఊళ్లో ఉత్సవాల్లో తిరిగి తిరిగి అలసిపోయి వచ్చిన వారికి పసందైన విందు భోజన ఘుమఘుమలు.. మూడురోజుల పండుగలో క్షణం తీరక దొరకని అనూభూతులతో నిండిపోతాయి.
సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. ఈ పేరు వినగానే అందరి మదిలో మెదిలేది అక్కడి ప్రజల మమకారం. మాటల మాటున వెటకారంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం తలంపుకొస్తాయి. అందులోనూ కోనసీమకే వన్నెతెచ్చే కొబ్బరిచెట్లు, గోదావరి జలాల మధ్య అలలారుతున్న వరిపొలాలు భూమి మీద పచ్చని తివాచీ పర్చినట్లుండే కోనసీమ అందాలు పకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
మరోపక్క అక్కడమాత్రమే వండివడ్డించే రుచులు భోజన ప్రియుల్ని కట్టిపడేస్తాయి. కోనసీమకు వెళ్లాలంటే కూసంత కడుపు ఖాళీచేసుకుని వెళ్లాలంటారు అక్కడి రుచుల్నెరిగిన వారు. పళ్లెం నిండా నోరూరించే పిండివంటలతో సంక్రాంతి అతిథిలకు స్వాగతం పలుకుతోందండి గోదావరి ఆయ్.... సాయంత్రం భోజనాలవ్వగానే రేపొద్దున టిఫిన్ గురించి ఆలోచనలో పడతారు. అలాంటి వాటిలో గోదావరి జిల్లాలోనే పేరుగాంచిన వంటకం మీకోసం..
ఇక్కడ చాలా ప్రసిద్ధి
గతంలో చాలా వంటకాలు ఉండేవండి. కాలం మారుతున్న కొద్దీ కొత్తరుచులు వచ్చి పాత రుచులు కనుమరుగయ్యాయి. అలాంటి వాటిలో పనసాకు పొట్టిక్కలు ఒకటి. ఇదేంటి పనసాకులతో వంటకం ఏంటనుకుంటున్నారు...? తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి కూతంత దూరంలోనున్న అంబాజీపేటకు వెళ్లాల్సిందే. గోదావరి జిల్లాల్లోనే కొబ్బరి మార్కెట్కు పేరుగాంచింది అంబాజీపేట... నిత్యం వందలాదిమంది యాపారం నిమిత్తం ఇక్కడికి వస్తారు. ఇక్కడ దొరికే పొట్టిక్కలు తినకుండా వెళ్ళరంటే నమ్మండి బాబు...
ఎలా చేయాలి
అసలు ఈ పనసాకు పొట్టిక్కలంటే ఏంటో తెలుసుకుందాం..! పరిశుభ్రంగా ఉన్న పనసాకుని చిన్న చిన్న బుట్టలుగా చేసి అందులో ఇడ్లీపిండి వేసి ఆవిరిపై ఉడికిస్తారు. వడ్డించేటప్పుడుకూడా బుట్టతోనే వడ్డిస్తారు. కాకుంటే పనసాకుతో ఉడకడం వల్ల ఈటికి భలే గమ్మత్తయిన రుచొత్తాది. దీనికి దబ్బకాయలో బెల్లం, అల్లం వేసి రుబ్బిన చట్నీ కలిపితింటే నాలుక నాట్యమాడటం ఖాయం.
ఇంటికి వెళ్తున్నారా..?
పొట్టిక్కలను కొందరు కొట్టక్కబుట్టలని, మరికొందరు కొట్టుంగ బుట్టలని పిలుస్తుంటారు. గతంలో ఈ వంటకం చాలా సుపరిచితం అయినప్పటికీ అన్నిచోట్ల లభించదు. మిగతా రోజులు ఎలా ఉన్నా పోలాల అమాసనాడు వీటిని ఆంధ్రోళ్లు వండుకోకుండా ఉండరు. ఇన్నాళ్లు రకరకాల అల్పాహారాలు రుచిచూసిన నాలుక వీటి గురించి తెలిసాక ఒకసారి తినాలనిపిస్తోంది కదూ... ఇంకెందుకు ఆలస్యం ఎలాగూ సంక్రాంతికి వచ్చారు కాబట్టి వీటినీ ఓ పట్టు పట్టేయండి...
ఇదీ చూడండి: ఇళ్లు చేరాలంటే ఈ ఫీట్లు తప్పవు మరి