శ్రీకాంత్ యూఎస్‌లో నేవీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తనలోని భయాన్ని పొగొట్టుకునేందుకు ఎత్తైన ప్రదేశాలను అధిరోహించాలనుకున్నాడు. ఇందుకోసం కిలిమంజారోను ఎంచుకున్నాడు. కుటుంబసభ్యులూ అంగీకరించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా... ఈ యాత్రకు తన పదకొండేళ్ల కుమార్తె ఇషాన్వీని తీసుకెళ్లాలనుకున్నాడు. ఇది ఇంట్లో వారిని కలవరపెట్టింది.
ఆత్మస్థైర్యం నింపేందుకే...
ఇషాన్వీలో ఆత్మస్థైర్యం నింపేందుకే తీసుకెళతానని అందరిని ఒప్పించాడు. కిలిమంజారో అధిరోహణకు ఇద్దరు సిద్ధమయ్యారు. తన కుమార్తె పర్వతంపైనున్న వాతావరణ పరిస్థితులు ఎదుర్కోగలదా అని భయపడ్డాడు. ఇది అధిగమిస్తే తన జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటుందన్న భావనతో యాత్రను ప్రారంభించారు.
ఎమోషనల్‌గా సాగిన యాత్ర...
యాత్రకు సంబంధించిన ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ... సమయానుగుణంగా ఇషాన్వీకి ఆహారం అందిస్తూ ఎనిమిది రోజులు యాత్రను కొనసాగించాడు. జర్నీ అంతా చాలా ఎమోషనల్‌గా సాగిందని పేర్కొన్నాడు. కూతురు ఇబ్బంది పడిన ప్రతీసారి మరింత జాగ్రత్తలు తీసుకున్నానని శ్రీకాంత్ వెల్లడించారు. కిలిమంజారో అగ్రభాగానికి చేరుకున్నాక తన భయాన్ని అధిగమించిన దానికంటే తన కుమార్తె సాధించిన ఘనతే రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
నాన్న చెప్పేవరకు తెలియదు...
తన తండ్రి చెప్పేవరకు కిలిమంజారో గురించి తెలియదని... ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు ఇషాన్వీ తెలిపింది. తరగతిలోని విద్యార్థులు ఓ సెలబ్రిటీలా చూస్తున్నారని... అది ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొంది.
చిన్ననాటి నుంచే ఆడపిల్లల్లో ధైర్యసాహాసాలు నూరిపోయడం అందరి కర్తవ్యం. నేటి సమాజంలో భిన్న పరిస్థితులను ఎదుర్కొనడంలో వారి సాహసాలే ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇవీ చూడండి: 'శబరిమల' తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ- భద్రత కట్టుదిట్టం