ఏపీలో 3 రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... రాజధాని ప్రాంత రైతుల నిరసనలు కొనసాగిస్తున్నారు. 15 వ రోజుకు చేరిన ఈ ఆందోళనలతో... రైతులు కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తమ పిల్ల పాపలతో వేడుకలకు దూరంగా ఉన్నారు. కారుణ్య మరణానికైనా తమకు అవకాశం కల్పించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలు రాశారు. రాజధాని తరలిపోతే తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని, తమకు మరణమే శరణమని లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో తామంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్మశానం అన్నందుకే... కాటికాపరి వేషంతో నిరసన
ఆందోళన చేస్తున్న వారు స్థానికులు, రైతులు కాదంటూ పలువురు నేతలు చేసిన ఆరోపణలపై మండిపడిన తుళ్లూరులోని రైతు కుటుంబాలు ఆధార్ కార్డులతో సహా ధర్నా చేశారు. అమరావతిని శ్మశానం అన్నందుకు ఓ రైతు కాటికాపరి వేషం వేసి నిరసన వ్యక్తం చేశాడు. కొత్త సంవత్సరం సందర్భంగా మహిళలు ఇళ్లముందు హ్యాపీ న్యూ ఇయర్‌కు బదులు సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ముగ్గులు వేశారు.
రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు పర్యటన
నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. మహిళలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భువనేశ్వరి మహిళలకు సంఘీభావంగా హాజరు కానున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం,మందడం గ్రామాల్లో ఈ పర్యటన జరగనుంది.
నేడు మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహించనుండగా... వెలగపూడిలో 15వ రోజు రైతులు రిలే నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఎర్రబాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెం, నవులూరు సహా రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో రైతుల నిరసనలు కొనసాగనున్నాయి. కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టనున్నాయి. రేపటి నుంచి ప్రకాశం జిల్లాలోనూ ఐకాస తరుఫున రాజధానిగా అమరావతే కావాలంటూ ఆ ప్రాంత ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు సిద్ధం అయ్యాయి.
ఇదీ చూడండి: 'పల్లె ప్రగతి'తో ఊరు మారుతోంది