ఐటీ ఉద్యోగం బోర్ కొట్టిందని.. మానసిన ఆనందం ఇవ్వడంలేదని.. నెలకు లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. తండ్రి నడిచిన బాటలో తన ప్రయాణం ప్రారంభించాడు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయ సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు విజయనగరం జిల్లాకు చెందిన లింగాల శంకర్.
లక్షల జీతం వదిలేశాడు...
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లికి చెందిన లింగాల శంకర్‌ది వ్యవసాయ కుటుంబం. ఇంటర్ తర్వాత విశాఖలోని గీతం కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఏడాదికి 11.50లక్షల రూపాయల జీతంతో ఆరేళ్ల పాటు ఐటీ ఉద్యోగం చేశాడు. మిత్రులతో కలసి హైదరాబాద్‌లోనే ఓ వ్యాపారం ప్రారంభించాడు.
వ్యవసాయం వైపు అడుగులు...
అప్పుడు తన మనసును వ్యవసాయం వైపు మళ్లించాడు. తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. వారిని బలవంతంగా ఒప్పించిన శంకర్... పొలం బాట పట్టాడు. తల్లిదండ్రుల అండతో సాగు చేపట్టాడు. మొదట్లో ఆశించిన ఫలితం రాలేదు. ఆలోచనలో పడ్డ శంకర్... తప్పు ఎక్కడ జరుగుతుందో గమనించాడు. ఆధునిక వ్యవసాయం వైపు మళ్లాడు. తక్కువ పెట్టుబడితో... అధిక దిగుబడులిచ్చే విధానాలను అనుసరించాడు.
ఐదున్నర ఎకరాల్లో... 23 రకాల పంటలు
బహుళ పంటల సాగుపద్ధతిలో ఐదున్నర ఎకరాల పొలంలో 23 రకాల పంటలు సాగుచేస్తున్నాడు. 2.2ఎకరాల్లోనే 22 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాడు. 365రోజులూ ఏదో ఒక రకమైన పంట దిగుబడి వచ్చే సాగు విధానం పాటిస్తున్నాడు. మూడు రోజులకోసారి 600 నుంచి 800 కిలోల దిగుబడులు పొందుతున్నాడీ యువరైతు.
మల్బరీ సాగుతోనూ మంచి దిగుబడి...
4ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు చేస్తూ... ఏడాదికి రెండు పంటల దిగుబడి సాధిస్తున్నాడు. 300 నుంచి 350 గుడ్ల పెంపకంతో... 300కిలోల వరకు మెరుగైన దిగుబడులు పొందుతున్నాడు. తక్కువ పెట్టుబడితోనే పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నాడు.
పట్టుపురుగుల పెంపు...
బాయిలర్ కోళ్ల పెంపకానికి ఉపయోగించిన షెడ్లలోనే పట్టుపురుగుల పెంచుతున్నాడు. పురుగుల మేత కోసం కత్తిరించిన తర్వాత వృథాగా ఉన్న మల్బరీ పుల్లలను తిరిగి వినియోగించి.. నర్సరీ పెంచుతున్నాడు. వీటిని పట్టుపరిశ్రమ శాఖ అధికారుల సహాయ సహకారాలతో రైతులకు తక్కువ ధరకు అందిస్తున్నాడు.
నూతన విధానంతో మెరుగైన దిగుబడి...
పంటల సాగులో స్వల్ప పెట్టుబడులు.. నూతన విధానాలతో మెరుగైన దిగుబడులు పొందుతూ ఆశించిన లాభాలు ఆర్జిస్తున్న శంకర్ నేటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మరికొంత మంది రైతులను తనతోనే నడిపిస్తున్నాడు.
తోటి రైతులకు మార్కెట్ సౌకర్యం...
తన పంట ఉత్పత్తుల అమ్మకంతోపాటు... తోటి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో రైతుమిత్ర పేరుతో విక్రయకేంద్రాలు ఏర్పాటు చేశాడీ శంకర్. తాను సాగుచేస్తున్న పంటలన్నింటికీ గోధారిత విధానాలనే అనుసరిస్తున్నాడు. ఇందుకోసం ఓ దేశీయ ఆవును పోషిస్తూ దాని ద్వారా వచ్చిన మలమూత్రాలనే.. ఎరువులు, చీడపీడల నివారణకు కషాలయల తయారికి వినియోగిస్తున్నాడు. ఐదున్నర ఎకరాల్లోని పంటలన్నింటికీ బిందు సేద్యం ద్వారా సాగునీటి అందించటం, సోలార్ విద్యుత్తునే వినియోగిస్తున్నాడు.
ఇవీ చదవండి: తెరాస ప్రచారం షురూ.. నేతలకు కేసీఆర్ ఆదేశం