రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధుల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. రాష్ట్రంలో వ్యాధుల పరిస్థితిపై హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, పురపాలకశాఖల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వ్యాధుల నివారణ, వ్యాప్తి, వైద్య పరీక్షలు, అందుతున్న వైద్యసేవలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి...
మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, జపానీస్ ఎన్ సెఫలైటిస్ లాంటి వ్యాధులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే ప్రత్యేక బృందాలను పంపినందుకు సీఎస్ ధన్యవాదాలు తెలిపారు. వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలతో పాటు జ్వరాలు వచ్చిన చోట వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధుల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దోమల ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిబంధనల ప్రకారం నివారణ చేపట్టాలన్నారు. ఇందుకోసం సరైన యంత్రాలను వినియోగించాలని... ఫాగింగ్ను సరైన పద్ధతిలో చేపట్టి ప్రజలకు తెలపాలన్నారు. జిల్లాల్లో అధికారులను చైతన్యపరచాలని సీఎస్ తెలిపారు.
ఇదీ చూడండి: బంపర్ ఆఫర్: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు