హైదరాబాద్లోని మూఖ్దూం భవన్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ భవిష్యత్తు నిర్ణయాలను డి.రాజా మీడియాకు వివరించారు. దిశ ఎన్కౌంటర్ సరికాదని చెప్పారు. ఆ చర్యను పార్టీ ఖండిస్తోందన్నారు.
370 రద్దు ప్రజాస్వామ్య విరుద్ధం...
కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు ప్రజాస్వామ్య విరుద్ధమని రాజా తెలిపారు. జమ్ము కశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను మోదీ కాలరాశారని ధ్వజమెత్తారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని వాగ్దానం చేశారని... ఆ ఉద్యోగ కల్పన ఏమైందని ప్రశ్నించారు.
అయోధ్య తీర్పులో వైరుధ్యాలు...
అయోధ్య తీర్పులో వైరుధ్యాలు కన్పిస్తున్నాయని రాజా అభిప్రాయ పడ్డారు. ఎన్‌ఆర్‌సీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని... ప్రధాని మోదీ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు తీసుకురావాలని చూస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం, పరిశ్రమ రంగాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని చెప్పారు.
వారంరోజులపాటు నిరసనలు...
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జనవరి 1 నుంచి 7వ తేదీ వరకూ నిరసనలు తెలపనున్నట్లు రాజా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీలో యూనియన్లు వద్దంటున్నారని... కార్మికులు ఉన్నంత వరకూ యూనియన్లు ఖచ్చితంగా ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ఈ నెల 11వ తేదీన 13 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
ఇవీ చూడండి : ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ