ఆర్టీసీ ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం సందర్భంగా జరిగిన అరెస్టులు, లాఠీఛార్జ్‌లను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పోలీసుల లాఠీ ఛార్జీలో గాయపడ్డ వారికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్య నేతలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణను ప్రభుత్వం అణచి వేస్తూ...ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
కార్యకర్తలను అణచివేస్తున్నారు...
ఏ చిన్న ఉద్యమ కార్యక్రమం చేపట్టినా.... కాంగ్రెస్ నేతల ఇళ్లను పోలీసులు దిగ్బంధనం చేస్తూ, నాయకులను గృహనిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో నాయకులను పోలీస్స్టేషన్లకు తరలిస్తూ... ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలను పూర్తిగా అణచివేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఆదివారం మరోసారి సమావేశం కావాలని భట్టి నిర్ణయించారు. సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీ చందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం