రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచడం వల్ల మహిళలపై దాడులు పెరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆక్షేపించారు. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, దిశ ఘటనపై సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
హైదరాబాద్ నగరంలో దిశ, వరంగల్‌లో మానస, ఆసిఫాబాద్‌లో లక్ష్మీ సంఘటనలు కలిచివేస్తున్నాయన్నారు. వెంటనే నిందితులను ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ప్రజలకోసం కాకుండా అధికార నేతల కోసం మాత్రమే పనిచేస్తోందని భట్టి ఆరోపించారు.
ఆర్టీసీ ఛార్జీలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. ఈ నెల 7న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు. అనంతరం ట్యాంక్‌బండ్ నుంచి రాజ్‌భవన్ వరకు ప్రదర్శన నిర్వహిస్తామని ఇందులో కాంగ్రెస్ నేతలంతా పాల్గొంటారని వివరించారు. ప్రదర్శన తర్వాత గవర్నర్‌ను కలుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇవీచూడండి: వడ్డీ రేట్లు యథాతథం- ఆర్బీఐ కీలక నిర్ణయం