రాష్ట్రంలో రైతులకు సహకారం అందించాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు - ప్యాక్స్‌లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్యాక్స్ పాలక వర్గాలకు ఐదేళ్ల పదవీకాలం... గత ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే ముగిసింది. అప్పట్నుంచి ప్రతి 6 నెలలకోసారి అవే పాలకవర్గాలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా పదవీ కాలం పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇలా జారీ చేయడానికి కొన్ని నిబంధనలు విధించింది. ఏమైనా అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం ఉన్న పాలకవర్గాలకు పదవీకాలం పొడగింపు ఇవ్వద్దనేది ప్రధాన నిబంధన. ఏదైనా సంఘంలో లొసుగులు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా సహకార అధికారులు డీసీవోలకే ఇచ్చారు. అయితే వారికి ముడుపులిస్తే ఏం కాదులే అన్న ధీమా ప్యాక్స్ సిబ్బందిలో నెలకొంది.
ఎలా సంపాదిస్తున్నారో...
ఒక గ్రామం ప్యాక్స్‌లో చుట్టు పక్కల 5 నుంచి 10 గ్రామాల రైతులు సభ్యులుగా ఉంటారు. వ్యవసాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర ఉపకరణాలు వంటివి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రైతులకు అమ్మాలి. అక్టోబరు నుంచి జూన్ దాకా రైతులు పండించిన పంటలను మద్ధతు ధరలకు కొనాలి. పంట రుణాలు ఇచ్చి తిరిగి వసూలు చేయాలి. ఈ పనుల్లో లెక్క పత్రం చూపకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.
గత ఆగస్టు, సెప్టెంబరులో యూరియా కొరత ఏర్పడటానికి ప్యాక్స్ సిబ్బంది, పాలకవర్గాలే కారణమని మార్క్‌ఫెడ్ ఇటీవల సహకార శాఖకు లేఖ రాసింది. ఖమ్మం అయ్యవారిగూడెం సొసైటీలో యూరియా అమ్మకాల్లో అవినీతి కారణంగా సీఈవోపై సస్పెండ్ వేటు పడింది. ఇదే జిల్లా తల్లాడ మండలం కలకొడిమ సహకార సంఘంలో 58 లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడినందున సీఈవోను సస్పెండ్ చేశారు. రైతులు కట్టిన పంట రుణ బకాయిల సొమ్ము పాక్స్ సిబ్బంది, పాలకవర్గాలు తినేస్తుండటం వల్ల బకాయిలు అంతే ఉన్నట్లు రికార్డుల్లో కనిపిస్తోంది. దీనివల్ల రైతులకు కొత్త రుణాలు మంజూరు కాలేదు.
ఫిర్యాదులు వస్తేనే చర్యలు
లంచాలు తీసుకుంటున్న డీసీవోలపై ప్రభుత్వం వరకు ఫిర్యాదులు వస్తేనే వారిపై చర్యలకు ఆస్కారముంది. అప్పటిదాకా అక్రమాలు బయటపడటం లేదని సహకార శాఖ వర్గాలు తెలిపాయి. అసలు అంతంతమాత్రంగా ఉన్న సంఘాల ఆర్థిక పరిస్థితి అవినీతి వ్యవహారాలతో మరింత దిగజారుతోంది.
ఇవీ చూడండి: ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్‌గా జీవన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ