ఎల్లుండి మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమావేశం కానున్నారు. సంస్థకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు కార్మికులతో స్వయంగా భేటీ ఆవుతానని నిన్నటి మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ ఒకటిన ప్రగతి భవన్లో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు.
ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగిన రవాణాసౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశానికి పిలిచే ప్రతి ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలని స్పష్టం చేసిన సీఎం... అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ కు తీసుకురావాలని, వారికి అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలపై పూర్తిస్థాయిలో చర్చిస్తారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ, ఈడీలతో పాటు రీజినల్ మేనేజర్లు, ఆర్వీఎంలు, డీవీఎంలను కూడా సమావేశానికి ఆహ్వానించారు.
అటు ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకునేందుకు అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రవాణా శాఖ మంత్రి అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్లో శుక్రవారం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో పాటు కార్మికులతో నేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.