పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల పేరుతో దాడులకు పాల్పడడం తీవ్రమైన చర్యగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అభివర్ణించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక రాష్ట్రంలో చేపట్టకూడదని సీఎం కేసీఆర్‌ని కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం సిగ్గు చేటని వ్యాఖ్యనించారు.
పార్లమెంటులో చేసిన చట్టాన్ని తెలంగాణలో అమలు చేయమనడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. అఖిల భారత ముస్లిం కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రికి చెప్పగా.. అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని ఆయన కోరడం దురదృష్టకరమన్నారు. దేశాన్ని రెండు వర్గాలుగా విభజించాలన్న విషపూరిత ఆలోచన కేసీఆర్‌లో ఉందని ఈ విషయం ద్వారా స్పష్టమవుతుందని ధ్వజమెత్తారు.
ముస్లిం ఓటు బ్యాంకు కోసమే...
పౌరసత్వ సవరణ చట్టంలో దేశ పౌరులకు ఏ విధమైన ఇబ్బంది లేకున్నా.. పాతబస్తీలో ముస్లిం ఓటుబ్యాంకును పదిలం చేసుకునేందుకు అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆయనకు వంతపాడుతున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ జనవరి 30న హైదరాబాద్‌లో ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’ అన్న నినాదంతో బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి ముస్లిం మత నాయకులను, ప్రతినిధులను ఆహ్వానించే బాధ్యత అసదుద్దీన్ ఓవైసీకి అప్పగించడం దారుణమన్నారు.
తెరాసపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు...
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. అందుకే జనవరి 30న సభ అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ముస్లిం మైనార్టీ ఓట్లను గంపగుత్తగా తెరాసకు వేయించుకోవాలన్న దురుద్దేశం కనిపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు తెరాసపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని... రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.
ఇదీ చూడండి: నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..