బాలాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నీళ్లట్యాంకు పైకి ఎక్కిన ఏఎస్సై నరసింహ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు నీళ్ల ట్యాంకు ఎక్కినప్పుడు కానిస్టేబుళ్లు వారించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. తోటి పోలీస్ అతన్ని రక్షించి వెంటనే కిందికి దింపాడు.
నరసింహ ఛాతిభాగానికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 20 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే...?
బాలాపూర్ పీఎస్‌లో నరసింహ ఏఎస్సైగా విధులు నిర్వహించేవాడు. ఇటీవల అతన్ని మంచాల్ పీఎస్‌కు బదిలీ చేశారు. గురువారం అక్కడికి వెళ్లి రిపోర్టు చేశారు. అయితే బాలాపూర్ సీఐ సైదులు... తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నివేదిక ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు బదిలీ చేశారని నరసింహ ఆరోపించారు. ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ జయరాంతోపాటు ఇతర ఉన్నతాధికారులు అపోలో ఆసుపత్రికి వచ్చి నరసింహ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కంచన్‌బాగ్ అపోలో ఆసుపత్రికి చేరుకుని... చికిత్స పొందుతున్న నర్సింహను పరామర్శించారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో వరుసగా మూడో రోజూ బంద్