ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగసిన నిరసనలు, ఎక్కడికక్కడ రైతులు, రాజకీయ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు, లాఠీఛార్జ్‌ల మధ్య రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. పరిపాలన మొత్తాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ- సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన బిల్లుకూ పచ్చజెండా ఊపింది.
తెదేపా నేతల సస్పెన్షన్
రాజధానిపై కీలక నిర్ణయం కోసమే ప్రత్యేకంగా సోమవారం ఉదయం 11 గంటలకు మొదలైన శాసనసభ తొలిరోజు సమావేశం... అధికార, ప్రతిపక్ష సభ్యుల వాడీవేడీ వాగ్వాదాల మధ్య రాత్రి 11 గంటల వరకూ సాగింది. చంద్రబాబు మినహా ప్రతిపక్ష తెదేపాకు చెందిన 17 మంది సభ్యులను సస్పెండ్ చేసి... మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు.
బిల్లులోని ముఖ్యాంశాలు
వికేంద్రీకరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటు అంశంతోపాటు జోన్లవారీగా ప్రణాళికాభివృద్ధి ఏర్పాటు అంశాలను చేర్చారు. దీని ప్రకారం పరిపాలన మొత్తం విశాఖపట్నానికి తరలిపోనుంది. రాజ్‌భవన్, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలతో పాలన మొత్తానికి విశాఖే కేంద్రం కానుంది. శాసనసభ, శాసనమండలితో అమరావతి శాసనపరమైన కార్యకలాపాలకే పరిమితం కానుంది. ప్రధాన న్యాయమూర్తితో కర్నూలులో హైకోర్టు కొలువుదీరనుంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఇతర ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటవుతాయి. ఏపీసీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం, రైతులకు కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచడం, భూమిలేని ప్రతి పేద కుటుంబానికి నెలకు 5వేలు ఇవ్వడం వంటి అంశాలను బిల్లులో చేర్చారు.
ఇవీ చూడండి:రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు పూర్తి