భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు అట్టహాసంగా కొనసాగిన భద్రాద్రి బాలోత్సవం ముగిసింది. చిన్నారుల హావభావాలతో ఈ వేదిక సంబరాలను పంచింది. ఆద్యంతం మురిపించడంతో అదే ఉత్సాహంతో తిరుగు పయనమయ్యారు.
వేలాది మంది ఒకేచోట...
జాతీయ స్థాయి బాలల సంబురాల్లో వేలాది మంది విద్యార్థులు పాలు పంచుకోవడంతో అన్ని వేదికలు కళకళలాడాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు అవకాశం కల్పించడం వల్ల వారి కుటుంబ సభ్యులు సైతం వచ్చి సాంస్కృతిక సంబరాలను ఆసాంతం ఆస్వాదించారు.
ఉర్రూతలూగించిన జానపదం...
జానపద నృత్యాలు ఉర్రూతలూగించాయి. పాటల పోటీలు అదరహో అనిపించాయి. కవితాగానం అంశానికి ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నారుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనను వెలికితీసింది. చిన్నచిన్న కథలు చెప్పి మెప్పించారు. ఇందులో దాగి ఉన్న నీతిని వివరించి అభినందనలు అందుకున్నారు.
మిమిక్రీ.. 'పువ్వులు'...
మిమిక్రీతో నవ్వులు పూయించారు. లేఖా రచన, వ్యర్ధంతో అర్థం, స్పెల్లింగులను వెంటనే చెప్పిన విధానం ఆకట్టుకుంది. తాళ్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తానా, ఐటీసీ, ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ సహకారంతో నిర్వహించిన బాలల పండుగ అందర్నీ మురిపించింది.
బాలల ప్రతిభ బ్రహ్మాండం
బాలల సంబరాలు బ్రహ్మాండంగా ఉన్నాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి భద్రాద్రి బాలోత్సవం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ప్రముఖులతో కలిసి విజేతలకు బహుమతులు అందించారు. బాలబాలికలు ప్రకాశవంతంగా ఎదిగితేనే దేశం బాగుంటుందని అన్నారు. చిన్నారుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
పెద్దల ఆశీర్వచనం...
తాళ్లూరి పంచాక్షరయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడారు. ఎన్సీహెచ్ చక్రవర్తి, వల్లూరిపల్లి వంశీకృష్ణ ఉత్సవాల నిర్వహణ విశేషాలను వివరించారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, డా.అనితారాణిలను రామాలయం ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు చేతులు మీదుగా సత్కరించగా విశ్రాంత ప్రధానార్చకుడు జగన్నాథాచార్యులు ఆశీర్వచనం అందించారు.
ఇవీ చూడండి : పొలం బడిలో విద్యార్థులకు సేద్యం నేర్పిన పాఠాలు!