నిబంధనలకు విరుద్ధంగా
నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ఎవరైనా సాగు చేస్తే పాలనాధికారి ప్రత్యేక ఉత్తర్వులతో గానీ, ఆర్డీవో, ఎమ్మెల్యే సభ్యులుగా ఉన్న కమిటీ ఆమోదం మేరకు పట్టాలు జారీ చేసే వెసులుబాటు ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా నిబంధనలు పాటించకుండా గుడిలోని సర్వే నంబర్ 19 లో 55 ఎకరాలు 24 మంది పేరిట, కరంజి శివారులోని సర్వే నంబరు 143లో 45 ఎకరాలను 15 మందికి, గోముత్రి శివారులోని సర్వే నంబర్ 56లో ఇద్దరు రైతుల పేర 8 ఎకరాల భూమికి పట్టా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
తహసీల్దార్ వత్తాసు
ఇలా పట్టాలివ్వడానికి ఎకరాకు రూ.15వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సంబంధిత సర్వే నంబర్లలో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలకు మాత్రం పట్టాలు ఇచ్చేందుకు అధికారులు వెనకాడుతున్నారు. ఈ అక్రమాల్లో వీఆర్వోలుగా ఇంఛార్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు వీఆర్ఏలు, ధరణి ఆపరేటర్ పాత్ర ఉన్నట్లు... వారికి తహసీల్దార్ వత్తాసు పలికినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తప్పు ఒప్పుకున్న తహసీల్దార్
ఈ వ్యవహారంలో ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బులు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే అసలు బండారం బయట పడే అవకాశం ఉంది. ఈటీవీ భారత్ చరవాణిలో తహసీల్దార్ మల్లేష్‌ను వివరణ కోరగా ఆ పట్టాలను వెంటనే రద్దు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్ పాసింగ్ పరేడ్.. విమానాల విన్యాసాలు