డోపింగ్ టెస్టులో మన క్రీడాకారులు తరచూ విఫలమవుతున్న తరుణంలో.. తాజాగా మరో షూటర్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. షూటింగ్ ప్రపంచకప్ పతక గ్రహీత రవికుమార్ డోప్ టెస్టులో విఫలమయ్యాడు. అయితే తన తప్పును అంగీకరించాడు. అనుకున్న దానికన్నా శిక్ష తక్కువగా పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) నిషేధించిన ప్రోప్రనోలాల్ అనే ఉత్ప్రేరకాన్ని రవికుమార్ వాడినట్లు తేలింది. దిల్లీలో జరుగుతున్న దేశవాళీ పోటీలో అతడిని పరీక్షించారు. ఇందులో అతడు హైబీపీని నిరోధించే ఉత్ప్రేరకాన్ని వాడినట్లు తేలింది.
"మైగ్రెయిన్(పార్శ్వపునొప్పి)కు విరుగుడుగా నేను ఆ ఔషధం తీసుకున్నా. డోప్ టెస్టుకు ముందు గత మే - జూన్ సమయంలో ఈ ఉత్ర్పేరకాన్ని నా వైద్యుడి సలహా మేరకు వాడాను. జాతీయ డోపింగ్ నిరోధక వ్యవస్థ(నాడా)కు జరిగినదంతా వివరించా. నేను ఈ ఒక్క తప్పు మాత్రమే చేశా. ఈ ఔషధం నిషేధిత జాబితాలో ఉన్న విషయం అప్పుడు నాకు తెలియదు. -రవికుమార్ షూటర్.
రవికుమార్ శాంపిల్ టెస్టు 'ఏ' కు అంగీకరించాడు. ఇందులో విఫలమైతే రెండేళ్ల వరకు శిక్షపడే అవకాశముంది. ముందే ఇందుకు ఒప్పుకున్నాడు కాబట్టి తక్కువ శిక్ష పడుతుందని అతడు ఆశిస్తున్నాడు. ఈ అంశంపై నాడా క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
"ఫలితం నాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నా. జాతీయ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏఐ) దేశవాళీ పోటీల్లో ఆడేందుకు అంగీకరించింది. జాతీయ జట్టులోకి మాత్రం తీసుకోలేదు. ఇప్పటికే ఆసియా ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యా. అందులో సత్తాచాటుంటే ఒలింపిక్స్‌కు అర్హత సాధించేవాడినే." -రవికుమార్, షూటర్
ఇప్పటికే ఒలింపిక్స్ ఆశలు అడియాసలయ్యానని, నాలుగేళ్ల నుంచి నేను పడుతున్న కష్టం వృథా అయిందని ఆవేదన వ్యక్తంచేశాడు రవి. ఈ నెలలో ఫలితం అనుకూలంగా వస్తే, చివరి అవకాశం వరకు పోరాడతానని స్పష్టం చేశాడు.
2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రవికుమార్ కాంస్యాన్ని దక్కించుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నాడు.
ఇదీ చదవండి: విరుష్క పెళ్లికి రెండేళ్లు.. ఇన్ స్టాలో ప్రేమ లేఖలు