భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్. ఇప్పటికే ఈ స్టార్ బాక్సర్ 2013లో పద్మభూషణ్, 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 8 పతకాలతో చరిత్ర...
వయసు మీద పడింది.. ముగ్గురు పిల్లల తల్లి ఇక ఆమె పనైపోయిందన్నారు.. చిన్న టోర్నీల్లోనూ.. పేరు లేని ప్రత్యర్థుల చేతుల్లోనూ ఓడిపోతుంటే మళ్లీ రాణించడం కష్టమన్నారు.. ఈ విమర్శలేవీ మేరీకోమ్‌ను ఆపలేకపోయాయి. గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటకుండా అడ్డుకోలేకపోయాయి. ఈ మణిపురి తార ఎనిమిదేళ్ల విరామం తర్వాత గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. ఇందులో 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంలో కాంస్యం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ షిప్లో ఇప్పటివరకు 8 పతకాలు (ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం) గెలిచింది మేరీ కోమ్. ఇవే కాకుండా 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇండియా ఓపెన్, ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెన్షియల్ కప్‌లోనూ పసిడి పతకాలు కైవసం చేసుకుంది మేరీ. ప్రపంచ టోర్నీ చరిత్రలోనే 8 పతకాలు సాధించిన బాక్సర్‌గా మేరీ నిలిచింది.