పేరు: కోబి బీన్ బ్రయాంట్
ఆట: బాస్కెట్‌బాల్
దేశం: అమెరికా
కెరీర్: 1996 నుంచి 2016 వరకూ ఎన్‌బీఏలో లాస్ ఏంజెల్స్ లేకర్స్‌కు ప్రాతినిథ్యం
ఘనతలు: అయిదు ఎన్‌బీఏ టైటిళ్లు, రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ఎన్‌బీఏ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు.
తండ్రి బాటలో
బాస్కెట్‌బాల్ బ్రయాంట్ రక్తంలోనే ఉంది. అతని తండ్రి జో బ్రయాంట్ మాజీ ఎన్‌బీఏ ఆటగాడు. అతను ఆడుతుంటే ఆసక్తిగా చూసిన కోబి తండ్రి మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నాడు. నాన్న స్ఫూర్తితో ఆరేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టి చిన్నతనం నుంచే అద్భుతాలు చేయడం మొదలెట్టాడు. పాఠశాల స్థాయి క్రీడల్లో అదరగొట్టాడు. దేశంలోనే అత్యుత్తమ పాఠశాల ఆటగాడిగా నిలిచి ప్రతిష్ఠాత్మక ఎన్‌బీఏ డ్రాఫ్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. 18 ఏళ్ల వయసులో ఛార్లోట్ హార్నెట్స్ జట్టుకు ఎంపికై.. అతిపిన్న వయసులో ఎన్‌బీఏ జట్టులో చోటు సంపాదించిన ఆటగాడిగా అప్పుడు చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత లేకర్స్ జట్టుకు మారాడు. 1996 నుంచి 20 ఏళ్ల పాటు ఆ జట్టు తరపున ఆడి సంచలనాలు నమోదు చేశాడు.
ఘనత ఎంతో
ఎన్‌బీఏ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కింది.. ఇక దశ తిరిగిపోవడం ఖాయమని అందరూ భావిస్తుంటారు. కానీ తుది జట్టులో చోటు కోసం కొంతకాలం నిరీక్షించక తప్పలేదు. అయితే ఒక్కసారి జట్టులో సుస్థిర స్థానం సంపాదించాక అతడికి తిరుగులేకుండా పోయింది. 2000 నుంచి వరుసగా మూడేళ్ల పాటు లేకర్స్‌ను ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిపాడు. 2008 సీజన్ ఫైనల్లో జట్టు ఓడినప్పటికీ అత్యంత విలువైన ఆటగాడిగా అతను నిలిచాడు. ఆ తర్వాత రెండేళ్లు జట్టునూ ఛాంపియన్‌గా నిలిపాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌ల్లో అమెరికాకు స్వర్ణాలు అందించాడు. ఆ తర్వాత గాయాల కారణంగా ఆటలో వేగం తగ్గడంతో 2015-16 సీజన్ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
ఆఖరి వరకూ ఆటతోనే
ముందు ఓ బాస్కెట్‌బాల్ ఆటగాడి కొడుకు.. తర్వాత ఓ బాస్కెట్‌బాల్ దిగ్గజం. ఇదీ స్థూలంగా కోబి జీవితం. అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగిన అతని ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. ప్రతి దశలోనూ ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. అడ్డంకుల్ని అధిగమించాడు కాబట్టి విజేతగా నిలిచిపోయాడు. ఎన్‌బీఏకు ఎంపిక అయ్యాడు.. అని చదవడానికి బాగానే అనిపిస్తోంది. కానీ ఆ స్థాయికి చేరడం వెనక.. రోజూ ఎనిమిది గంటల శిక్షణ ఉంది. సరదాలకు దూరంగా గడపడం ఉంది. బంతితోనే జీవితాన్ని ముడిపెట్టడం ఉంది. 20 ఏళ్లు గడిచేసరికే పేరు, ప్రఖ్యాతులతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరినా అతను తన అడుగులను దారి తప్పనివ్వలేదు. ఏకాగ్రతను చెక్కు చెదరనివ్వలేదు. జట్టుకు విజయాలు అందించడమే అన్నింటి కంటే ప్రధానమైందిగా భావించాడు. 2013లో ఎన్‌బీఏ ప్లేఆఫ్ మ్యాచ్‌లో జట్టును గెలిపించడం కోసం మోకాలి గాయంతోనే బరిలో దిగాడు. ఎంత గొప్పగా ఆడుతున్నా కూడా తన ఆటను మెరుగుపర్చుకోవడం కోసం అతను నిత్యం శ్రమిస్తూనే ఉండేవాడు. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటారు. కానీ అతను ఆటకు దూరం కాలేదు. కూతరు కోసం కోచ్‌గా మారాడు. భవిష్యత్ ఆటగాళ్లకు సూచనలిస్తూ గడిపేవాడు. చివరకు కూతుర్ని అకాడమీకి తీసుకు వెళ్తూనే మరణించాడు. చివరి శ్వాస వరకూ ఆటతోనే కలిసి సాగాడు.
ఆస్కార్ కొట్టాడు
ఆటగాడిగానే కాదు ఓ రచయితగా కూడా కోబి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. ఆస్కార్ అవార్డూ సొంతం చేసుకున్నాడు. రిటైర్మెంట్ సందర్భంగా ఆటపై ప్రేమతో అతను రాసిన 'డియర్ బాస్కెట్‌బాల్' కవిత ఆధారంగా అదే పేరుతో రూపొందించిన యానిమేషన్ లఘు చిత్రానికి గాను ఉత్తమ రచయితగా 2018లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ ఘనత సాధించిన తొలి ప్రొఫెషనల్ అథ్లెట్‌గా చరిత్ర నమోదు చేశాడు. పాశ్చాత్య సంగీతంపై అవగాహన ఉన్న కోబి ఆల్బమ్స్‌లోనూ నటించాడు.
* ఒక మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు (81) చేసిన రెండో ఆటగాడిగా కోబి రికార్డు నమోదు చేశాడు. విల్ట్ (1962లో 100 పాయింట్లు) మొదటి స్థానంలో ఉన్నాడు.
* అత్యంత విషపూరితమైన సర్పం 'బ్లాక్ మాంబా' పేరును తను ముద్దుపేరుగా పెట్టుకున్నాడు. గరిష్ఠ వేగంతో.. నిర్దిష్టమైన కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకోగలిగే నైపుణ్యాలు ఉన్న అతను దానికి గుర్తుగా ఆ పేరు పెట్టుకున్నాడు.
* ఎన్‌బీఏ చరిత్రలో అత్యధిక పాయింట్లు (33,643) సాధించిన ఆల్‌టైం ఆటగాళ్ల జాబితాలో కోబి నాలుగో స్థానంలో ఉన్నాడు.
* అతని మృతికి సంతాపంగా సోమవారం ఫ్రెంచ్ లీగ్‌లో పీఎస్‌జీ జట్టు తరపున గోల్ చేసిన తర్వాత నెయ్‌మార్ చేతితో కోబి జెర్సీ నంబరు '24'ను తెలిపేలా సంకేతాలిచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిక్ కిర్గియోస్ లేకర్స్ జెర్సీ వేసుకుని నాదల్‌తో మ్యాచ్ ఆడాడు.
* కోబీకి గౌరవ సూచకంగా అతను ఆడిన '8', '24' నంబరు జెర్సీలకు లేకర్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించింది.
"ఆల్‌టైమ్ అత్యుత్తమ బాస్కెట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన బ్రయాంట్.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రెండో జీవితాన్ని ఇటీవలే మొదలెట్టాడు. కుటుంబంపై అతనికి అమితమైన ప్రేమ.. భవిష్యత్‌పై బలమైన నమ్మకం ఉండేది. అతని అందమైన కూతురు జియానా కూడా చనిపోవడం మరింత బాధాకరమైన విషయం."
- అమెరికా అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్"కోబి మరణవార్త విని నిర్ఘాంతపోయా. తన ఆటతో మంత్రముగ్ధుల్ని చేసే ఈ మాంత్రికుణ్ని టీవీలో చూసేందుకు చిన్నతనంలో తొందరగా నిద్రలేచేవాణ్ని. జీవితం ఊహించలేనిది. ఆ ప్రమాదంలో అతని కూతురు జియానా కూడా చనిపోయిందని తెలిసి నా గుండె పగిలింది."
- విరాట్ కోహ్లి"హెలికాప్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబి బ్రయాంట్, అతని కూతురు జియానాతో పాటు ఇతరులు చనిపోయారనే వార్త బాధ కలిగించింది. అతని కుటుంబానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు నా సానుభూతి తెలుపుతున్నా."
- సచిన్ తెందుల్కర్"నా అభిమాన ఆటగాడు కోబి బ్రయాంట్, అతని కూతురు ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయిదు ఎన్‌బీఏ టైటిళ్లు, రెండు సార్లు ఎన్‌బీఏ ఫైనల్స్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఘనత పొందిన అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. కన్నీళ్ల నివాళి అర్పిస్తున్నా."
- తెలంగాణ మంత్రి కేటీఆర్
కూతురే కొడుకుగా
కొడుకు పుడితే అతణ్ని కూడా బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌గా చేయాలన్నది కోబి లక్ష్యం. అయితే అతడికి నలుగురు కూతుళ్లే పుట్టారు. అయినా నిరాశ చెందలేదు. తన రెండో కూతురు జియానాను విజేతగా నిలపాలనుకున్నాడు.
ఆమె కూడా తాత వారసత్వాన్ని తండ్రి పుణికిపుచ్చుకున్నట్లు.. నాన్న బాటలోనే తనూ నడవాలనుకుంది. బంతి చేతబట్టింది. స్వయంగా కోబీనే తనకు శిక్షణ ఇచ్చేవాడు. జియానా అంటే కోబీకి ఎంతో ప్రేమ. తనను విడిచి ఉండేవాడు కాదు. ఎప్పుడూ తన పక్కనే ఉండేవాడు. చివరకు మరణంలోనూ కలిసే సాగారు. తన 13 ఏళ్ల కూతురు మ్యాచ్ కోసం వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.
ఇదీ చదవండి: 'కొత్త సెలక్షన్ కమిటీ బాధ్యతలు అప్పటి నుంచే'