మహిళల బాడీ బిల్డింగ్ పోటీలు గురించి వినే ఉంటాం. పురుషుల మాదిరిగానే బికినీలు ధరించి కండలు ప్రదర్శిస్తారు. ముస్లీం మెజార్టీ గల బంగ్లాదేశ్‌లో తొలిసారి ఈ పోటీలను ఆదివారం నిర్వహించారు. అయితే ఇక్కడ మాత్రం శరీరం కనిపించకుండా, బట్టలేసుకుని తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో 19ఏళ్ల అవోనా రెహమాన్ విజేతగా నిలిచింది.
బిగుతుగా ఉండే లెగ్గిన్స్, ఔట్ ఫిట్లు ధరించి దేహధారుడ్య పోటీల్లో పాల్గొన్నారు మహిళలు. మూడు రోజులపాటు ఢాకాలో ఈ పోటీలు జరిగాయి. రెహమాన్‌తో పాటు 29 మంది స్త్రీలు ఈ పోటీల్లో తమ దేహధారుడ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం విజేతగా నిలిచినందుకు రెహమాన్ ఆనందం వ్యక్తం చేసింది.
"నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందుకోసం నేను ఎంతో కష్టపడ్డా. నా దేహాన్ని చూపిస్తే విమర్శిస్తారనే ఆలోచనే నా మనసులో కలగలేదు. నా సోదరుడు వ్యాయామశాల నడుపుతున్నాడు. అతడు నాకు మద్దతుగా నిలిచాడు. "
- అవోనా రెహమాన్, బాడీ బిల్డర్
బంగ్లాదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని డ్రెస్ కోడ్‌ను రూపొందించామని బంగ్లా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నజ్రుల్ ఇస్లాం చెప్పాడు.
"బంగ్లాదేశీ సంప్రదాయలకు అనుగుణంగా నిర్దేశిత వస్త్రధారణను(డ్రెస్ కోడ్) అవలంభించాలని ముందే చెప్పాం. మా మతం, సంస్కృతి సంప్రదాయల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అమ్మాయిలకు పొడవాటి లెగ్గిన్స్, స్లీవ్ టాప్స్‌ను ఎంపిక చేశాం. ఆరోగ్యం, ఫిట్నెస్ అంశాల్లో మహిళలను ప్రొత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహించాం."
-నజ్రుల్ ఇస్లాం, బంగ్లా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ
బంగ్లా జనాభాలో 90 శాతం మంది ముస్లింలు. ఇప్పుడిప్పుడే ఆ దేశంలోని మహిళలు.. క్రికెట్, ఫుట్‌బాల్, ఆర్చరీ లాంటి క్రీడలపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదీ చదవండి: పాంటింగ్‌పై అభిమానుల అగ్రహం.. టెస్టు జట్టుపై అంతృప్తి