ప్రముఖ భారత రెజ్లర్ బబితా ఫొగాట్ పెళ్లి ఘనంగా జరిగింది. హరియాణా సంప్రదాయంలో వివేక్ సుహాగ్తో జరిగిన ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో పర్యావరణాన్ని కాపాడాలని ఓ సందేశం ఇచ్చారు. వధూవరులిద్దరూ ఓ మొక్కనాటి ఆదర్శంగా నిలిచారు.
ప్రముఖ రెజ్లర్ బజ్రంగ్ పునియా, గీతా ఫొగాట్తో పాటు ఆమె భర్త రెజ్లర్ పవన్ సరోహా, వినేశ్ ఫొగాట్తో పాటు ఆమె భర్త రెజ్లర్ సోమ్బిర్ రాథి, విదేశీ కోచ్ జకియా సాకో తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.
కెరీర్ విశేషాలు..
2010, 2012 కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా వెండి, కాంస్య పతకాలు సొంతం చేసుకుంది బబిత. 2013లో హరియాణా ప్రభుత్వం ఆమెను సబ్ ఇన్స్పెక్టర్గా నియమించింది. ఆ తర్వాత 2014లో(స్వర్ణం), 2018లో(రజతం) జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించింది. ఈమె కుటుంబంలో బబితతో కలిపి నలుగురు పహిల్వాన్లు ఉండటం విశేషం.
మరో ప్రముఖ రెజ్లర్ గీతా ఫొగాట్ ఆమెకు సోదరి. వీరిద్దరి జీవిత చరిత్ర ఆధారంగా 'దంగల్' సినిమా తీశారు. ఆమిర్ ఖాన్ కీలకపాత్ర పోషించాడు.ఈ ఏడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసింది రెజ్లర్ బబితా. దాద్రీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఈ క్రీడాకారిణి.. స్వతంత్ర అభ్యర్థి సంబీర్ సాంగ్వాన్ చేతిలో ఓడిపోయింది.
ఇవీ చూడండి.. 'దంగల్' కుటుంబంలో పెళ్లి సందడి