2008 బీజింగ్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్.. అమెరికా చేతిలో భారత్ ఓడిపోయింది.. జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చాక సీనియర్ క్రీడాకారిణి సుమన్ బాల వెక్కి వెక్కి ఏడుస్తుంటే అప్పుడప్పుడే జాతీయ జట్టులోకి వచ్చిన 14 ఏళ్ల ఆ అమ్మాయి బిక్క మొహం వేసింది. ఎందుకు దీదీ ఏడుస్తోంది.. అని మాత్రమే అనుకుంది. కారణం అప్పటికి ఆమెకు ఒలింపిక్స్‌పై పెద్దగా అవగాహన లేదు.
మళ్లీ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ వచ్చాయి.. ఆ అమ్మాయి జట్టులో స్టార్‌గా ఎదిగింది. రష్యాపై కీలక సమయంలో గోల్‌తో జట్టును చాలా ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ (రియో) మెట్టు ఎక్కించింది. అప్పుడు తెలిసింది ఆమెకు ఒలింపిక్స్ విలువ ఏంటో. ఆరోజు సుమన్ బాల ఎందుకు ఏడ్చిందో! ఆ ఒక్కసారి మాత్రమే కాదు తాజాగా టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో అమెరికాతో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో గోల్ చేసి జట్టుకు ఒలింపిక్స్ బెర్తు సంపాదించిపెట్టింది.
తీవ్ర ఒత్తిడిలో.. మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాలే మిగిలుండగా.. ప్రత్యర్థి జోరుమీదున్న సమయంలో అద్భుత రీతిలో గోల్ చేసి.. వరుసగా రెండోసారి జట్టు ఒలింపిక్స్‌కు అర్హత పొందడంలో కీలకపాత్ర పోషించిన ఆ మిస్ కూల్ ఎవరో కాదు.. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్. ఏడాది క్రితం గాయాలు, అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందిపడిన ఆమె కెరటంలా ఎగిసిపడి భారత్‌ను టోక్యో చేర్చింది.
"14 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చినప్పుడు ఒలింపిక్స్ అంటే ఏంటో.. ఈ మెగా ఈవెంట్ విలువేంటో తెలియదు.. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో ఆడడం ఎంత గర్వకారణమో తెలిసొచ్చింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో కీలక సమయంలో గోల్ చేసి జట్టుకు బెర్తు సంపాదించి పెట్టడం ఆనందంగా ఉంది."
-రాణి రాంపాల్, భారత మహిళా హాకీ కెప్టెన్
2008లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడం వల్ల సుమన్ బాల ఒకటే మాట చెప్పింది.. "మా కెరీర్‌లు ఇంతటితో ముగిసినట్లే అని".. ఈ మాటలు రాణి మనసులో బలంగా నాటుకున్నాయి. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం దేశ ప్రతిష్ఠను పెంచడమే అనే అభిప్రాయం ఆమెలో కలిగింది. అందుకే గత ఒలింపిక్స్ క్వాలిఫయర్‌లోనూ ఆమె ఆఖరి వరకు పోరాటం ఆపలేదు. కీలక గోల్‌తో జట్టును రియో గడప తొక్కించింది. తాజాగా మళ్లీ అదే ప్రదర్శనను రాణి పునరావృతం చేసింది. ప్రత్యర్థి జట్టు 4-0తో ముందంజలో ఉన్నా.. మొత్తం గోల్స్ లెక్కల్లో భారత్‌ను 4-4తో సమానం చేసినా.. ఆమె తన ప్రశాంతతను కోల్పోలేదు. నాలుగో క్వార్టర్‌కు కాస్త ముందు గోల్ చేసి జట్టులో మళ్లీ స్థైర్యం నింపింది. ఇలా ఉత్కంఠభరిత క్షణాల్లో గోల్స్ కొట్టి మ్యాచ్‌లను మలుపు తిప్పడం రాణీకి కొత్తేం కాదు. బెల్జియంలో జరిగిన ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో ఇటలీతో మ్యాచ్‌లో అద్భుత గోల్‌తో స్కోరు సమం చేయడమే కాక.. సడన్ డెత్‌లో గోల్ చేసి జట్టును గెలిపించింది. అంతకుముందు జపాన్‌తో చావోరేవో మ్యాచ్‌లోనూ ఆమె గోలే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది.
ప్రశాంతంగా..
సవాళ్లను ఎదుర్కోవడం, ప్రశాంతంగా ఉండడం రాణీకి చిన్నప్పటి నుంచి అలవాటే. ఎందుకంటే ఆమె నేపథ్యం అలాంటిది. హరియాణాలోని షాహ్‌బాద్‌కు చెందిన ఈ అమ్మాయిది పేద కుటుంబం. నాన్న రిక్షా నడిపేవాడు. తమ రాష్ట్రంలో హాకీకి మంచి ఆదరణ ఉండడం, చుట్టూ అంతా హాకీ ఆడడం వల్ల చిన్నప్పుడే రాణి స్టిక్ పట్టింది. ద్రోణాచార్య బల్‌దేవ్‌సింగ్ శిక్షణలో రాటుదేలింది. కానీ హాకీ ఆడే శారీరక సామర్థ్యం ఆమెకు ఉండేది కాదు. పీలగా ఉండే రాణి రాష్ట్ర శిబిరంలో చేరిన తర్వాత ఫిట్‌నెస్ పెంచుకుంది. జాతీయ టోర్నీల్లో సత్తా చాటిన ఆమెకు 14 ఏళ్ల వయసులో భారత జట్టులో ఆడే అవకాశం దక్కింది. ఆమె తొలి టోర్నీనే 2008 ఒలింపిక్స్ క్వాలిఫయర్స్. 2010 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఆమె.. ఈ టోర్నీ ఆడిన పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆ టోర్నీలో 7 గోల్స్ చేసి అందర్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె కెప్టెన్సీ బాధ్యతలూ చేపట్టింది.
ఇవీ చూడండి.. పంత్‌కు అండగా గంగూలీ.. సలహాలిచ్చిన సంగక్కర