యువరాజ్ సింగ్... ఈ పేరు వింటే ప్రత్యర్థి బౌలర్లకు హడల్. దూకుడైన ఆటతీరుతో క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. అన్నింటికంటే ముఖ్యంగా కేన్సర్‌ను జయించి.. పునరాగమనంతో తెగువ చూపాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్‌సింగ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కెరీర్లో కొన్ని ఉత్తమ ఇన్నింగ్స్‌పై ఓ లుక్కేద్దాం.
అండర్-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి..
2000 జనవరిలో శ్రీలంకను ఓడించి భారత్ అండర్- 19 ప్రపంచకప్ నెగ్గింది. ఈ టోర్నీలో యువరాజ్ 33.83 సగటుతో 203 పరుగులు చేశాడు. తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో బౌలింగ్‌లోనూ ఆకట్టుకుని టీమిండియా సెలక్టర్ల దృష్టి ఆకర్షించాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం..
2000 అక్టోబరులో కెన్యాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు యువరాజ్. నైరోబిలో ఈ మ్యాచ్ జరిగింది. అనంతరం ఇదే నెలలో(అక్టోబరు 2000) ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్లో సత్తాచాటాడు. 80 బంతుల్లో 84 పరుగులు చేసి భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు యువీ.
లార్డ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్..
2002 జులైలో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ కైఫ్‌తో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 69 పరుగులతో సత్తాచాటాడు యువీ. ఫలితంగా భారత్ 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రక విజయాన్ని అందుకుంది. గంగూలీ చొక్కా విప్పేసి సంబరాలు చేసుకుంది ఈ మ్యాచ్‌లోనే.
2004 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు యువరాజ్. 122 బంతుల్లో 139 పరుగులు చేశాడు.
2006 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో భారత్ 5 వన్డేల సిరీస్ ఆడింది.ఈ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో యువీ 87, 79 అర్ధశతకాలతో సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే సిరీస్‌లో 93 బంతుల్లో 107 పరుగులు చేసి భారత్‌కు విజయాన్నందించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పొట్టి ప్రపంచకప్‌లో విశ్వరూపం..
2007 సంవత్సరాన్ని క్రికెట్ ప్రియులు అంత త్వరగా అప్పుడే మర్చిపోలేరు. ఎందుకంటే ఆ ఏడాదే తొలిసారి జరిగిన టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. అదీ.. దాయాది పాక్‌ను ఓడించి మరీ. సెప్టెంబరులో జరిగిన ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌పై రికార్డు అర్ధశతకం నమోదు చేశాడు యువీ. 12 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. టీ 20ల్లో ఇదే అతి వేగవంతమైన అర్ధశతకం. ఇంగ్లీష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు నమోదు చేశాడు యువీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2007 డిసెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 169 పరుగులు చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది భారత్.
విశ్వసమరంలో విధ్వంసమే..
2011 ఫిబ్రవరి 19- ఏప్రిల్ 2 మధ్యలో ప్రపంచకప్ జరిగింది. 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో యువీ 362 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డును సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా యువరాజ్ రికార్డు సృష్టించాడు.
కేన్సర్‌ను జయించి..
ప్రపంచకప్ అనంతరం యువీ క్యాన్సర్ బారిన పడ్డాడు. అనంతరం కేన్సర్‌ను జయించి అంతర్జాతీయ మ్యాచుల్లో తర్వాతి ఏడాదే పునరాగమనం చేశాడు. అయితే అనంతరం యువరాజ్ కెరీర్ అనుకున్నంత స్థాయిలో సాగలేదు. ఫామ్‌లేమి, ఫిట్నెస్ సమస్యలతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.
2017 జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదీ చదవండి: రంజీ మ్యాచ్‌లకూ 'పౌరసత్వ బిల్లు' సెగ