టీమిండియా సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ముంబయిలో మాట్లాడిన యువీ.. ఎమ్ఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైఫల్యాలను ఎత్తిచూపాడు. ఇప్పుడున్న వారి కంటే జట్టుకు మెరుగైన సెలక్టర్లు కావాలని తెలిపాడు.
"సెలక్టర్ల పని అంత సులభం కాదని నాకు తెలుసు. దేశం మొత్తం మీద 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసినపుడు మిగతా వారిని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తారు. ఇది కష్టమైన పని. కానీ ప్రస్తుత క్రికెట్లో పరిస్థితులకు తగినట్లు ఆలోచించట్లేదు. మనకు కచ్చితంగా మెరుగైన సెలక్టర్లు కావాలి. నేను ఎప్పుడూ ఆటగాళ్ల భవిష్యత్తు గురించే ఆలోచిస్తా." -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్
జట్టులో చోటు పోతుందనే భయంతోనే ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెడుతున్నారని అన్నాడు యువీ.
"ఆడలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా క్రికెటర్లు బరిలోకి దిగాల్సి వస్తుంది. ఒకవేళ ఆడకపోతే జట్టులో చోటు గల్లంతవుతుందేమోననే ఒత్తిడితో ఆడుతున్నారు. అలసిపోయినా, మానసికంగా బలంగా లేకపోయినా, గాయాలైనా ఆడక తప్పని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లకు మద్దతు కావాలి. మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడం వల్ల మ్యాక్స్‌వెల్ కొద్దికాలం ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా బోర్డు కూడా దాన్ని సమ్మతించింది. ఆటగాళ్లకు అలాంటి భరోసా కావాలి. గంగూలీ ఆటగాళ్ల దృక్పథంతో ఆలోచిస్తాడని అనుకుంటున్నా"
-యువరాజ్ సింగ్, మాజీ క్రికెటర్.
శివమ్ దూబేను తనతో పోల్చడం సరికాదని అంటున్నాడు యువీ. దుబే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడని... అప్పుడే పోలికలు పెట్టకూడదని చెప్పాడు. దుబే చాలా ప్రతిభ గల ఆటగాడని తెలిపాడు.
ఇదీ చదవండి: పట్టుదలకు ప్రతిరూపం.. 'విరాట్' విజయ ప్రస్థానం!