యువరాజ్ సింగ్.. ఈ పేరు వింటే గుర్తొచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సులు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన శైలి షాట్లతో, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒకానొక దశలో ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి, భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు చోటు కోల్పోయాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువీ.. ప్రస్తుతం విదేశీ లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ఆడకపోవడానికి కారణం ఏంటి.?
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్.. విదేశీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. గ్లోబల్ టీ20 కెనడాలో టొరంటో నేషనల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దుబాయిలో జరిగిన టీ10 లీగ్‌లో మరాఠా అరేబియన్స్‌కు ఆడి, టైటిల్ గెలిచాడు.
భారత క్రికెటర్ ఎవరైనా విదేశీ లీగుల్లో ఆడాలంటే బీసీసీఐ కొన్ని షరతులు విధించింది. అతడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి, ఐపీఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాకే విదేశీ లీగుల్లో ఆడేందుకు వీలుంటుంది. ఈ కారణంగానే యువీ ఈ ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
ఐపీఎల్ కెరీర్
ఐపీఎల్లో యువరాజ్ ఇప్పటివరకు ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఈ టోర్నీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మూడేళ్ల తర్వాత(2011) పుణె వారియర్స్ ఇతడిని కొనుగోలు చేసింది. పుణె.. 2013లో లీగ్ నుంచి వైదొలగిన కారణంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. తర్వాతి ఏడాది యువీకి డిమాండ్ మరింత పెరిగింది. ఆ సీజన్లో దిల్లీ, రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు పెట్టి అతడిని కొనుక్కుంది.
ఐపీఎల్లో యువరాజ్‌కు ఇంతలా డిమాండ్ ఉన్నా, ట్రోఫీ గెలిచేందుకు మాత్రం తొమ్మిదేళ్లు పట్టింది. 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో యువీ సభ్యుడు. అనంతరం మళ్లీ 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు బదిలీ అయ్యాడు.
వయసు పెరగడం, ప్రదర్శనలో అస్థిరత్వం కారణంగా 2019 ఐపీఎల్ వేలం మొదటి రౌండ్లో యువీని దక్కించుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. ముంబయి ఇండియన్స్ చివరి రౌండ్లో ఇతడిని కొనుగోలు చేసింది. గతేడాది విజేతగా నిలిచిన ముంబయి జట్టులో సభ్యుడు యువీ. అంటే ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని యువరాజ్ రెండుసార్లు ముద్దాడాడు.
ఇవీ చూడండి.. 'సెలక్షన్ కమిటీ తీసుకున్న గొప్ప నిర్ణయం అదే'